ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
Published Sun, Jul 23 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
- సొమ్ములు కట్టినా ఎదురుచూపులే..
- పీఎంఏవైలోనూ అర్హులకు మొండిచెయ్యి
- సిఫారసులకు, పచ్చచొక్కాలకే గృహయోగం
కాకినాడ : ‘అర్హత’కు ప్రాతిపదిక ఏమిటి? పేదరికమా? అధికార పార్టీ జెండా పట్టుకోవడమా? ప్రభుత్వం మారిపోతే అర్హులు ‘అనర్హులు’గా మారిపోతారా? జిల్లా కేంద్రం కాకినాడలో అర్హత కలిగిన గృహనిర్మాణ లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇల్లు మంజూరు చేస్తామంటే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వేలాది రూపాయలు అప్పులు చేసి, ప్రభుత్వానికి చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏడెనిమిదేళ్లుగా ఇల్లు మంజూరవుతుందని వెయ్యి కళ్లతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఐహెచ్‌ఎస్‌డీపీ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దీనికి దాదాపు 1,750 మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ములు కూడా చెల్లించారు. వీరిలో తొలివిడతగా అప్పట్లో 816 మందికి ఏటిమొగ, పర్లోపేట ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మందీ ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.86 వేల వరకు డీడీలు తీసి అప్పట్లోనే గృహనిర్మాణ శాఖకు అందజేశారు. అలా వీరంతా చెల్లించిన రూ.3 కోట్ల వరకు సొమ్ము గృహనిర్మాణ శాఖలో మూలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం కుంటుపడడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక సొంతింటి ‘కలే’నని లబ్ధిదారులు డీలా పడుతూ వచ్చారు. ఇళ్లు ఎప్పుడు మంజూరైనా సొమ్ములు కూడా చెల్లించిన తమకే ప్రాధాన్య క్రమంలో ముందుగా అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
పీఎంఏవైలో మొండిచెయ్యి
‘అందరికీ ఇళ్లు’ పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితమే వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లబ్ధిదారులను పక్కన పెట్టి పచ్చచొక్కాలతో కూడిన జాబితా బయటకు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా 4,600 ఇళ్లు మంజూరైనా పాత జాబితాలో ఉన్న చాలామందికి చోటు దక్కకకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు.
పారదర్శకత ఏదీ?
పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా తీసుకుని రాజకీయాలకు దూరంగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను కూడా సమన్వయం చేసుకుని అర్హులకు ఇళ్లు దక్కేలా కృషి చేశారు. ప్రస్తుతం అలాంటి విధానానికి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు చక్రం తిప్పి సొంత పార్టీ కార్యకర్తలకు, సొమ్ములు ఇచ్చినవారికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా చేసుకుపోవడంతో అర్హులకు మొండిచెయ్యే మిగిలింది.
గ్రీవెన్స్‌సెల్ ఎందుకూ?
కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్‌కు నిత్యం ఎంతోమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తే ఇక గ్రీవెన్స్‌సెల్ వల్ల ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుని డబ్బులు కూడా కట్టినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కలెక్టర్ న్యాయం చేయాలి
ఏడేళ్ల క్రితం ఇంటికోసం దరఖాస్తు చేశా. రూ.26 వేలు డీడీ కూడా తీసి ఇచ్చా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు వస్తుందని ఎంతో ఎదురు చూసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి.
- టి.సత్యనారాయణ, లబ్ధిదారు
నచ్చినవారికి ఇస్తున్నారు
గృహనిర్మాణాల్లో అర్హత కలిగిన పాత లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి. వేలకు వేలు అప్పులు చేసి సొమ్ములు కట్టాం. తీరా ఇళ్లు వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టి నచ్చినవారికి ప్రాధాన్యం ఇనిస్తున్నారు.
- బి.వెంకటలక్ష్మి, లబ్ధిదారు
వడ్డీలు కట్టలేకపోతున్నాం
ఇల్లు వస్తుందని మూడు విడతలుగా రూ.83 వేలు ప్రభుత్వానికి చెల్లించాను. అప్పులు చేసి కట్టడంతో టైలరింగ్ వృత్తిపై ఆధారపడుతున్న నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి, ఇళ్లు మంజూరు కాని పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి.
- వాయివాడ రమణ, లబ్ధిదారు
Advertisement
Advertisement