పేదల ఇళ్లు 2022కి పూర్తి: సీఎం జగన్‌ | CM YS Jagan comments in a virtual meeting with PM Modi | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లు 2022కి పూర్తి: సీఎం జగన్‌

Published Sat, Jan 2 2021 3:32 AM | Last Updated on Sat, Jan 2 2021 11:42 AM

CM YS Jagan comments in a virtual meeting with PM Modi - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను షెడ్యూల్‌ ప్రకారం 2022 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం (గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌) కింద ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన, పీఎంఏవై (అర్బన్‌), ఆశా–ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రధాని మోదీతో సహా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రధాని విజన్‌ ప్రకారం..
నూతన ఏడాది 130 కోట్ల మంది భారతీయుల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. కోవిడ్‌–19 నుంచి కోలుకుని దేశం ఆర్థికంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నా. 2022 నాటికి అందరికీ ఇళ్లు అని ప్రధాని విజన్‌ నిర్దేశించుకున్నారు. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. తుపానులు, భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను క్రమం తప్పకుండా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు గృహ నిర్మాణ కార్యక్రమంతో అవినాభావ సంబంధం ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పేదలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
వర్చువల్‌ విధానంలో లైట్‌ హౌస్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

మహిళా సాధికారత, ఆర్థిక భద్రత..
పీఎంఏవై (అర్బన్‌) కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదల్లో చాలామందికి ఇంటి స్థలాలు లేవు. దీంతో సొంతిళ్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. 25,433 ఎకరాల ప్రభుత్వ భూమితో సహా మొత్తం 68,677 ఎకరాలను ప్లాట్లుగా చేసి పేదలకు పంపిణీ చేశాం. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆర్థికంగా వెనుకబడ్డ వారికోసం 16,098 కాలనీలను అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లను కట్టించడమే కాదు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.12,410 కోట్లు ఖర్చు అవుతుంది. అందరికీ ఇళ్ల కింద రాష్ట్రానికి 20.21 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. 2022 నాటికి షెడ్యూల్‌ ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లను లబ్ధిదారులైన మహిళల పేర్లతోనే రిజిస్టర్‌ చేస్తున్నాం. మహిళా సాధికారత, ఆర్థిక భద్రత దిశగా ఇది దోహదపడుతుంది. 

ఆర్థిక రంగానికి భారీ ఊతం..
గృహ నిర్మాణ రంగంలో సుస్థిర, పర్యావరణ అనుకూల, విపత్తులను తట్టుకునే గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌ను ప్రధానమంత్రి ప్రారంభించడం అభినందనీయం. కోవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్ధ బాగా మందగించింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల వల్ల ఆర్థిక రంగానికి భారీ ఊతం లభిస్తుంది. 30 రకాల వృత్తిదారులకు ఇళ్ల నిర్మాణాల వల్ల ఉపాధి లభిస్తుంది. తాపీ పనిచేసేవారు, కార్పెంటర్లు, ప్లంబర్లు.. ఇలా అనేక మంది ఉపాధి పొందుతారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలుగుతాం. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గొప్ప ప్రయాణం చేసింది. అర్హులైన వారందరికీ 100 శాతం ఇళ్ల పట్టాలు మంజూరు చేశాం. తొలిదశలో 67 శాతం ఇళ్లను కూడా మంజూరు చేశాం. దీనికి అదనంగా 8.95 లక్షల ఇళ్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మంజూరయ్యాయి. పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన రాష్ట్రాల కింద ఏపీని ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం.  

రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులు..
దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా ప్రణాళిక, చక్కటి సదుపాయాలతో గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పురస్కారాలు దక్కాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులు లభించాయి. బెస్ట్‌ ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక విభాగంలో 2 అవార్డులు, ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో విశాఖకు మొదటి ర్యాంకు, అవార్డు దక్కింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ బాలశౌరి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తదితరులు క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement