వైద్యానికి సాయం చేయండి | CM YS Jagan Video Conference with Narendra Modi On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

వైద్యానికి సాయం చేయండి

Published Wed, Aug 12 2020 3:20 AM | Last Updated on Wed, Aug 12 2020 6:58 AM

CM YS Jagan Video Conference with Narendra Modi On Covid-19 Prevention - Sakshi

ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

ఇది నిజంగా పరీక్షా సమయం. ఈ సమయంలో మీరు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి టైర్‌–1 నగరాలు లేవు. అక్కడ మాదిరిగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవు. రాష్ట్రంలో వైద్యసదుపా యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నాం.
– ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పనకు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

ఒక వ్యూహంతో ముందుకు..
► కరోనా కట్టడికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాం. క్లస్టర్లలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వేగంగా కేసులను గుర్తిస్తున్నాం. కరోనా బాధితులకు సత్వరమే చికిత్స అందించడం ద్వారా మరణాలను నియంత్రిస్తున్నాం. వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించడంతోపాటు అన్ని ఆస్పత్రులలో మౌలిక వసతులను మెరుగుపరిచాం. 

ఒక్క ల్యాబ్‌ కూడా లేని పరిస్థితి నుంచి..
► ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు గుర్తించగానే పుణెలోని ల్యాబ్‌కు శాంపిల్‌ పంపించాం. రాష్ట్రంలో కనీసం ఒక్క వైరాలజీ ల్యాబ్‌ కూడా లేని స్థితి నుంచి ఇవాళ ప్రతి 10 లక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేసే స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఇవాళ 13 జిల్లాలలో కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు, చికిత్స అందించేందుకు పూర్తి సదుపాయాలు ఉన్నాయి. 


పరీక్షల్లో పూర్తి స్వావలంబన..
► కోవిడ్‌ నివారణ చర్యల్లో రెండు లక్షలమంది చురుకుగా పాల్గొంటున్నారు, రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటును 0.90 శాతం కంటే తక్కువకే పరిమితం చేసి పరీక్షల్లో పూర్తి స్వావలంబన సాధించాం.

అదే మా లక్ష్యం...
– ఆస్పత్రిలో చికిత్సకోసం వచ్చిన ఏ ఒక్కరూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండకూడదు. కోవిడ్‌ పరీక్షలు అవసరమైన వారికి నిరాకరించకూడదనేదే మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 100కుపైగా మొబైల్‌ యూనిట్ల ద్వారా 1,500కు పైగా కేంద్రాల్లో శాంపిల్స్‌ సేకరిస్తున్నాం.

సగటున 60 వేల పరీక్షలు
– ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలతోసహా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పరీక్షల సంఖ్య 70 వేలు దాటింది. ప్రస్తుతం రోజుకు సగటున 60 వేల పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలో రోజూ 9 వేల నుంచి 10 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 85 నుంచి 90 శాతం కేసులు క్లస్టర్ల నుంచే నమోదవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో సగటు తీసుకుంటే ఆ సంఖ్య తగ్గే వీలుంది. 

సేవల్లో 32 వేలమంది వైద్య సిబ్బంది
– రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాం. 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 32 వేలమంది వైద్యసేవల్లో నిమగ్నమయ్యారు. స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలున్నవారి కోసం మరో 109 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 56 వేలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్‌కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం 3,286 ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే ఉండగా ఇప్పుడు 11 వేలకుపైగా అందుబాటులో ఉన్నాయి. గత మూడు నెలల్లో ఏడువేలకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు సమకూర్చుకున్నాం. నిరంతరం పనిచేసే కాల్‌సెంటర్లతో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశాం. కేవలం అరగంటలో బెడ్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాం. వేగంగా వైద్యసేవలందించేందుకు ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టాం.
– ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement