సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం.
ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
చదవండి: 9.05 లక్షల మందికి జగనన్న తోడు
Comments
Please login to add a commentAdd a comment