సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు.
ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది.
కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది.
సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం.
– పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment