సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాని మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలిచ్చింది. పీఎంఏవై(అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.2 లక్షల కోట్లతో 1.18 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇందులో ఇప్పటికే 76 లక్షల గృహాలు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
మరో 42 లక్షల గృహాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం తెలంగాణలో 2.50 లక్షల గృహాలకు మంజూరులివ్వగా, ఇందులో 2.23 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికే కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4,475 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.3,314 కోట్లు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 21.32 లక్షల గృహాలకు మంజూరునివ్వగా, ఇందులో 7.95 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికై కేంద్రం తన వాటాగా రూ.32,499 కోట్లకు గాను రూ.20,045 కోట్లు విడుదల చేసింది. ఇక పీఎంఏవై(గ్రామీణ్) కింద కేంద్రం మొత్తంగా 2.93 కోట్ల గృహాల నిర్మాణాలను మంజూరులివ్వగా, అందులో 2.40 కోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 53 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment