సాక్షి, సిటీబ్యూరో: ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పీఎంఏవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయాలని సోమవారం జరిగిన కేంద్ర నూతన మంత్రిమండలి సమావేశం తీసుకున్న నిర్ణయంతో నగర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలోని ప్రజల కోసం రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించాలనుకున్నా, లక్ష ఇళ్ల పనులను ప్రారంభించి దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.దరఖాస్తులు ఎక్కువ , పూర్తయిన ఇళ్లు తక్కువ కావడంతో లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఆ సందర్భంగా ఇళ్లురాని పలువురు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాల్లో పాల్గొన్న అప్పటి మంత్రులు కేటీఆర్, తలసాని, తదితరులు ఇప్పుడు ఇళ్లు రాని వారు దుఃఖించవద్దని, దశలవారీగా పేదలందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు దాదాపు 7లక్షల మందికి పైగా ఉండగా,పంపిణీ చేసిన ఇళ్లు 70వేలే. దీంతో తమకెప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారెందరో ఉన్నారు.ఈ నేపథ్యంలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు మంత్రిమండలి నిర్ణయించడంతో వాటికోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయోజనం చేకూరగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లులేని వారికి ఇంటి సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట తాము పేదలకు గృహ సదుపాయం కల్పిస్తామని, స్థలమున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారు.పేరేదైనా కేంద్రప్రభుత్వం సహాయం అందజేయనున్న మూడు కోట్ల ఇళ్లలో నగరానికి కూడా గణనీయమైన సాయం అందగలదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పేరేదైనా, పథకమేదైనా నగరంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి తగిన నిధులందగలవనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment