తెరపైకి తెలంగాణ పార్కు | - | Sakshi
Sakshi News home page

తెరపైకి తెలంగాణ పార్కు

Published Sun, Dec 24 2023 4:20 AM | Last Updated on Sun, Dec 24 2023 11:36 AM

పార్కు నమూనా చిత్రం - Sakshi

పార్కు నమూనా చిత్రం

జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

వికారాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రం వికారాబాద్‌కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎఫ్‌ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి.

ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేశ్‌ స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్‌ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్‌ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది.

నిధుల మల్లింపుతో నిలిచిన పనులు
2019 జనవరి 29న అప్పటి కలెక్టర్‌ ఉమర్‌ జలీల్‌ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్‌ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్‌ఐడీసీ కింద వికారాబాద్‌ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది.

పర్యాటకులు పెరిగే అవకాశం
హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్‌ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్‌ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు.

పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్‌ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్‌ పూల్‌, రెయిన్‌ డ్యాన్స్‌ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్‌లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తొలి ప్రాధాన్యత
పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్‌కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్‌ను కోరాం.
– మంజుల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వికారాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement