పవిత్రమాసం.. ప్రత్యేకం
పహాడీషరీఫ్: పవిత్రమైన రంజాన్ మాసాన్ని జల్‌పల్లి మున్సిపాలిటీలోని ముస్లిం ప్రజలు నియమ నిష్టలతో జరుపుకొంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలో ఉంటున్న ముస్లింలు రాత్రంతా మెళకువతో ఉంటున్నారు. సాయంత్రానికి ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్, కొత్తపేట రహదారులు సందడిగా మారుతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా రంజాన్ పండగలో నిమగ్నమయ్యారు. ప్రతిరోజు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌ల చొప్పున ఐదుసార్లు నమాజ్ చేసి అల్లాహ్‌ను స్మరిస్తున్నారు.
ఇఫ్తార్ విందుల ఆరగింపు
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తొలి రోజు నుంచే ఇఫ్తార్ విందులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైన మాసంలో కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసి పరిచయస్తులను ఆహ్వానిస్తుంటారు. ఉపవాస దీక్ష విరమించిన ప్రజలు ఇఫ్తార్ విందులలో ఏర్పాటు చేసే పండ్లను ఆరగించడం ఆనవాయితీ. ఇందులో అన్ని రకాల పండ్లతో ఖర్జూరం వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. ఇఫ్తార్ విందులలో హిందూ, ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారు.
హలీం దుకాణాల వద్ద సందడి
ఈ మాసంలో ప్రధానంగా గుర్తుకొచ్చేది హలీం. రోజంతా ఉపవాస దీక్షలో ఉండే వారు సాయంత్రం దీక్ష విరమించిన అనంతరం పోషక విలువలున్న హలీంను ఆరగిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలయ్యిందంటే స్థానికంగా ఉన్న హలీం సెంటర్లు రద్దీగా మారుతున్నాయి. పహాడీషరీఫ్ పరిసరాలలో ఏర్పాటు చేసిన హలీం కేంద్రాలే కాకుండా పాత నగరంలో ఉన్న షా గౌస్, పిస్తాహౌజ్, షాదాబ్ వంటి హోటళ్ల నుంచి హలీం పార్సల్‌ను తెప్పించుకొని భుజిస్తున్నారు.
పెద్ద ఎత్తున జకాత్
రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం తమకున్న ఆస్తిలో కొంత శాతాన్ని పేద ప్రజలకు వెచ్చించాలి. ఇందులో భాగంగానే జల్‌పల్లి మున్సిపాలిటీలోని ముస్లింలు పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తున్నారు. పేద ప్రజలకు చీరలు, గృహావసర వస్తువులు ఇలాంటి వాటిని దానం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ దాన ధర్మాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
అంతటా రంజాన్ సందడి
కఠోర ఉపవాస దీక్షలో ముస్లింలు
Comments
Please login to add a commentAdd a comment