పిల్లలు లేక.. హాస్టళ్లు నడవక
ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. విద్యార్థులు రాకపోవడం, ప్రభుత్వం సైతం వీటి అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల హాస్టళ్లు మూతబడుతున్నాయి.
బంట్వారం: పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం చాలా కాలం కిందట మండల పరిధిలోని తొర్మామిడిలో మూతపడింది. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. తొర్మామిడి గ్రామంలో 2009లో ఎస్సీ హాస్టల్ భవనం ప్రారంభించారు. ఇందుకు గాను అప్పట్లో బీఆర్‌జీఎఫ్, జెడ్పీ నిధులు అవసరమైన మేరకు వెచ్చించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వసతిగృహం ప్రారంభించిన ఏడాది కాలంలోనే హాస్టల్ మూతపడింది. ఊరికి కిలో మీటరు దూరంలో భవనం కట్టించడంతో విద్యార్థులు అందులో ఉండేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు కూడా ఏడాదిలోనే హాస్టల్‌ను మూసి వేశారు. భవనం ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండడంతో ప్రస్తుతం బూత్ బంగ్లాను తలపిస్తుంది.
బంట్వారంలోనూ అదే పరిస్థితి
మండల కేంద్రం బంట్వారంలోని బీసీ వసతి గృహం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. విద్యార్థులు లేరనే సాకుతో సంబంధిత అధికారులు ఆరేళ్ల కిందట బీసీ హాస్టల్‌ను మూసి వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005 సంవత్సరంలో మత్స్యశాఖ ఈ భవనాన్ని కట్టించింది. అది ఏడాదిలోనే కూలే స్థితికి చేరింది. దీంతో అప్పట్లో వెంటనే అద్దె భవనంలోకి హాస్టల్‌ను మార్చారు. అందులో చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు ఉంటూ చదువుకునే వారు. ఉన్నట్టుండి బీసీ వెల్ఫేర్ అధికారులు 2017లో వసతి గృహాన్ని ఎత్తివేశారు. పిల్లలు లేరనే కారణంతో కోట్‌పల్లి ఎస్సీ హాస్టల్‌ను కూడా గతంలోనే ఎత్తి వేశారు. కోట్‌పల్లి కొత్త మండలముగా ఏర్పడడంతో హాస్టల్ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకుంటున్నారు.
హాస్టళ్లకు తగ్గిన ఆదరణ
గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో సీటు దొరకాలంటేనే పెద్ద కష్టంగా ఉండేది. రాను రాను హాస్టళ్లకు ఆదరణ పడిపోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో మూతపడే స్థాయికి చేరుకున్నాయి. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు వచ్చిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉండే వారు కరువయ్యారు. నానాటికి మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీహెచ్‌ఎస్ స్కూళ్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చిన్నారులు గురుకులాలు, మోడల్, కేజీబీవీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు.
మూతపడిన వసతి గృహాలు
వృథాగా మారుతున్న భవనాలు
Comments
Please login to add a commentAdd a comment