స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఒకప్పుడు పిల్లలకు పండుగదినం. 72 ఏళ్ల క్రమంలో నచ్చిన పార్టీకి ఓటువేసే, నచ్చని పార్టీని తిరస్కరించే రాజకీయ స్వేచ్ఛ మనకు వచ్చిం దేమో కానీ మన సామాజిక వ్యవస్థ నేటికీ అప్రజాస్వామ్యంగానే కొనసాగుతోంది. కులం, అంటరానితనం, మహిళల అసమానత దీని మౌలిక లక్షణాలు. దేవుడు భారతీయులను అసమానంగా సృష్టించాడన్న ఆధ్యాత్మిక ఫాసిజం ఇప్పుడు మతం రూపంలో రాజ్యమేలుతోంది. ఆగస్టు 15, జనవరి 26 రావచ్చు, వెళ్లిపోవచ్చు. కానీ మన మేధో చింతనలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కీలక చర్చనీయాంశంగా మారకపోతే మన రాజ్యాంగ సంవిధానం ఏ సమయంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. మన ప్రజాస్వామ్యంలో మానవులకంటే జంతువులు మరింత గౌరవప్రదంగా మనుగడ సాగిస్తున్నాయి. వాటికి ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం అనేవి తెలీవు కాబట్టి.
ఆగస్ట్ 15 అంటే మేం చదువుకునే రోజుల్లో పాఠశాలకు పండుగ దినం అన్నమాట. 1950ల చివర్లో, 1960ల ప్రారంభంలో నా పాఠశాల రోజుల్లో ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉండేది. జెండా వందనం, తీపి మిఠాయి తినడం మా జ్ఞాపకాల్లో మిగిలి ఉంటోంది. 8 లేక 9 ఏళ్ల వయస్సులో గొడ్లు కాచే పని నుండి బలవంతంగా బడిచదువుకు మారిన అబ్బాయిగా బడి అంటే నాకు జైలులాగే తలపించేది. కానీ స్కూల్లో చేరిన తర్వాత తొలి ఆగస్టు 15 వచ్చినప్పుడు ఏదో తెలీని ఆనందం కలి గింది. ఆరోజు కాళ్లు ముడుచుకుని దుమ్ము నేలపై కూర్చునే పని ఉండేది కాదు. అది రహదారులపై ఆడుకునే రోజు. ఆరోజు పెన్సిల్ లేక కొత్త పలక వంటి చిన్ని బహుమతులు పొందవచ్చు అనే ఆశ పరవశం కలిగించేది. స్కూల్లో చేరిన తర్వాత తొలి ఆగస్టు 15న మా అన్నకు బహుమతి వచ్చింది. నాకు రాలేదని నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఇక్కడే నా వైఫల్యం, దాంతోపాటు అసూయ మొదలయ్యింది. బహుమతి రాకపోవడం అనేది వైఫల్యంతో ఇంకా ఎక్కువగా ఎలా పోరాడాలో నేర్పింది. అసూయ అనేది వైఫల్యాన్ని ఎలా అధిగమిం చాలో నేర్పించింది.
ఆ తర్వాత అనేక ఆగస్టు 15లు గడిచిపోయాయి. ఆనాడు నా తొలి ఆటలో నేను ఓడిపోయినట్లుగా భారతజాతి వైఫల్యం పొందిందా లేక ఇరుగుపొరుగు దేశాల్లో అసూయ రేకెత్తించడం ద్వారా మా తమ్ముడిలాగా విజయం పొందిందా? అనే అంశాన్ని మదింపు చేయాలనుకుంటున్నాను. మనది రాజకీయ ప్రజాస్వామ్యం. ఇక్కడ నాకు నచ్చని పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేసే స్వాతంత్య్రం నాకు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాననే ఆశతో నేను జీవిస్తాను. ఇది నా విజయం.
కానీ మనకు అప్రజాస్వామికమైన సామాజిక వ్యవస్థ ఉంది. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, తప్పుకుంటాయి. కానీ కులం, అంటరానితనం, మహిళల అసమానతలతో కూడిన భారత అప్రజాస్వామిక సామాజిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. నామీద, ప్రతి ఒక్కరిమీద అణచివేత, హింస వేలాడుతూనే ఉంది. ఈ సామాజిక వ్యవస్థలో పేదలు, పీడితులు కడగండ్లపాలవుతుండగా, ధని కులు సైతం అభివృద్ది చెందిన మానవులుగా జీవించడం లేదు. ఇది మన వ్యవస్థ ఘోర వైఫల్యం. అప్రజాస్వామికమైన సామాజిక వ్యవస్థ భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా కలిసి మనుగడ సాగిస్తోంది? ఎందుకంటే నా దృష్టిలో భారతీయ పౌర సమాజం అప్రజాస్వామికమైన ఆధ్యాత్మిక వ్యవస్థకు బంధీౖయె ఉంది.
ఈ 21వ శతాబ్ది ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ మన సామాజిక సంబంధాలను పాలించడంలో మతం కీలకపాత్ర పోషిస్తూ ఉంది. ప్రస్తుతం హిందూయిజంగా పేరుమార్చుకున్న భారతీయ బ్రాహ్మణవాదం దేవుడు భారతీయులను అసమానంగా సృష్టిం చాడన్న ఆధ్యాత్మిక ఫాసిజాన్ని నియమబద్ధంగా సంస్థాగతం చేసిపడేసింది. ఈ నేలపై కొనసాగుతున్న ఇతర మతాలు కూడా తమ సామాజిక సంబంధాలను (ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం తదితరాలు) విశాల ప్రాతిపదికన బ్రాహ్మణవాద నైతిక వ్యవస్థ పరిధిలోనే కొనసాగిస్తున్నాయి. అందువల్లెనే భారత రాజ్యాంగం దేశంలోని అన్ని ఆధ్యాత్మిక వ్యవస్థలకు చెందిన దిగువకులాలు, నిరుపేదలు, మహిళలకు సమానహక్కులను అందిస్తున్నప్పటికీ అనేక సామాజిక రంగాల్లో వీరు అవమానాలు, అసమానతల బారిన పడుతున్నారు.
పీడకుల హృదయ పరివర్తనవల్ల కాకుండా, పీడితులు త్యాగాలు చేస్తున్న కారణంగానే భారతీయ రాజ్యాంగ సంవిధానం మనుగడ సాగిస్తోంది. హిందువులకు (రామరాజ్యం) ఓటు వేసి అధికారం కల్పిస్తే స్వర్గం నేరుగా భారతీయ భూమిపైకి వచ్చి వాలుతుందని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటిస్తున్నాయి. మన దేశంలో కొంతమంది గోవులను పూజించదల్చినట్లయితే, పశువులను తోలుకుపోయేవారిని చిత్రహింసలకు గురిచేస్తారు. కొంతమంది ప్రజలు తమ దేవుడిపై నమ్మకం లేని ఇతరులను కూడా ఆ దేవుడినే పూజించాలని ఒత్తిడికి గురిచేస్తుంటారు. ఫలానా దేవుడిని మేం ఆరాధిస్తాం అని దళితులు ప్రకటిస్తే వారిని దేవాలయం నుంచి వెళ్లగొడతారు, చావగొట్టి చిత్రహింసలు పెడతారు. ఇతరులను చిత్రహింసలకు గురిచేసే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రజాస్వామ్యానికి నమూనాగా నిర్వచిస్తుంటారు.
దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ ఆధ్యాత్మిక ఫాసిజం ఆదేశానుసారమే పనిచేస్తుంటాయి. ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనని రాజ్యాంగబద్ధ సంస్థలు ఆమోదిస్తుంటాయి. మన దేశంలోని మేధావులు చాలా తీవ్రమైన గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే, వీరు ప్రజాతంత్ర వాతావరణంలో ఉన్న కుటుంబాలలో పుట్టినవారు కాదు. మతపరమైన సెక్యులర్ మేధావులిద్దరికీ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలోనే ఉమ్మడి మూలాలున్నాయి. వీరిరువురూ ఒకే కుదురులోంచి వచ్చారు. అందుకే వీరు ఒక గొర్రెలకాపరిని మేధావిగా పరిగణించరు. మీరు లౌకికవాది అయితే ఈ అంశాన్ని ఉపేక్షించవచ్చు. లేదా మీరు హిందువైనట్లయితే దీన్ని జాతి వ్యతిరేకమనుకోవచ్చు. మనందరం ఎప్పటికీ గొర్రెల్లాగానే ఉండాలి. అంతే తప్ప మనం సమానత్వ దేవుడు సృష్టించిన జంతువులన్నింటినీ సమానంగా చూసే విమర్శనాత్మకమైన గొర్రెల కాపరిగా ఎన్నటికీ మారకూడదు.
మనుషులందరినీ సమానులుగా దేవుడు సృష్టించాడు అనే సూత్రబద్ధతతోనే మానవ జీవితంలోకి దైవ భావన ప్రవేశించింది. కానీ ఈదేశంలో బ్రాహ్మణ వాదం తన రచనల ద్వారా, రోజువారీ జీవితాచరణ ద్వారా, దేవుడు మనుషులను అసమానులుగా సృష్టిం చాడని ప్రకటించింది. దాన్ని భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియనిజం కూడా ఆమోదించడమే కాకుండా తమ జీవితాచరణలో కూడా అసమానత్వాన్నే కీలకమైన అంశంగా స్వీకరించింది. మన దేశంలో చాలామంది మేధావులు తాము లౌకికవాదులమని భావిస్తుంటారు కానీ అన్ని మతాల పుట్టుకకు ఆధ్యాత్మక ఫాసిజమే మూలమనే అంశంపై చర్చించరు. వీరి దృష్టిలో వివిధ మతాలు ఉనికిలో ఉండటం అనేది సుందరమైన బహుళత్వానికి, వైవిధ్యతకు సంకేతమట. ఇలాంటి లౌకికవాదం వల్ల కూడా ఈదేశంలోని దళితులు, ఆది వాసులు, శూద్రులు కష్టాల్లో మునిగితేలుతున్నారు.
ఈ అంశాన్ని ఘనత వహించిన మన లౌకిక మేధావులు చర్చిం చరు. సామాజిక శాస్త్రం కాదు కాబట్టి ఆధ్యాత్మక వ్యవస్థపై చర్చ అనవసరం అనే బౌద్ధిక నిజాయితీ రాహిత్యం వీరిది. ప్రతి ఆధ్యాత్మిక అప్రజాస్వామ్యాన్ని చివరకు ఆధ్యాత్మిక ఫాసిజాన్ని కూడా సెక్యులరిజం తన ముసుగులో కప్పిపెడుతుంది. ఇదే యూనివర్సిటీల్లో, సివిల్ సర్వీసులో, రాజకీయరంగంలో వారి ఉద్యోగాలను కాపాడుతోంది మరి. అసమానత్వాన్ని దేవుడి ప్రసాదంగా ఎంచే మతం పాలి స్తున్నప్పుడు నిర్దిష్ట రాజకీయ ప్రజాస్వామిక చర్చ ఆ మతాన్ని కూడా చర్చలోకి లాగాల్సిందే. లేకుంటే ఆధ్యాత్మిక బానిసల సమ్మతితో విద్రోహులు అధికారం చేజిక్కించుకుంటారు.
ఆధ్యాత్మిక నిరంకుశాధికారత్వం, చివరకు ఫాసిజం కూడా వ్యవస్థాగత ఆధ్యాత్మికవాదంలో భాగమే. ఎందుకంటే బ్రాహ్మణవాదం ప్రతి భారతీయుడిలోకి చొచ్చుకుపోయింది. మానవులను అది బాని సత్వంలో లేక ఆధిపత్యం కింద జీవించేలా చేసింది. బ్రిటిష్ హయాంలో కొన్ని సంస్కరణలు ప్రారంభమైనా, భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థలు మాత్రం అప్రజాస్వామికంగానే కొనసాగుతూ వచ్చాయి. ప్రజాస్వామ్యం అంటే వీటి దృష్టిలో మానవ చింతనకు, పౌరసమాజానికి అతీతంగా జీవించే స్వయం ప్రతిపత్తి వ్యవస్థ అని అర్థం. కాని ఇది నిజం కాదు. 72 ఏళ్ల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం తర్వాత కూడా మానవ అసమానత్వం అనేది మన కాలానికి, వయస్సుకు, మనం స్వీకరించిన రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం సరిపోలడం లేదు.
మన మేధో చింతన ప్రక్రియలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కీలక చర్చనీయాంశంగా మారకపోయినట్లయితే మన రాజ్యాంగ సంవిధానం ఏ సమయంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో దీన్ని మనం చూస్తున్నాం.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 (గణతంత్రదినం) రావచ్చు, వెళ్లిపోవచ్చు. యువత ముసలితనంలోకి ప్రవేశించవచ్చు. వృద్ధులు ఈ దేశంలో ఆధ్యాత్మక, సామాజిక సంబంధాల్లో మౌలిక మార్పులను చూడకుండానే మరణించవచ్చు కూడా. కానీ నా దేశ ప్రజాస్వామ్యంలో మానవులకంటే జంతువులు మరింత గౌరవప్రదంగా మనుగడ సాగిస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఆధ్యాత్మకం, సామాజికం, రాజకీయం అనేవి తెలీవు కాబట్టి.
ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్, వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment