కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు వివాదాస్పద పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్యులు, బీజేపీ కార్యకర్తలు.. ఐలయ్య వర్గీయుల పరస్పరం నినాదాలు.. తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్యవైశ్య వర్గీయుల్లో ఒకరు చెప్పు విసరడంతో ఓ అడ్వకేట్‌కు తగిలింది. దాడికి నిరసనగా ఐలయ్య వర్గీయులు నంది చౌక్ వద్ద ధర్నా చేశారు. ఐలయ్య బుధవారం కోర్టుకు రాగా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నీలి మధు, నాయకులు నోటికి నల్లవస్త్రం కట్టుకొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.
కోర్టు ఐలయ్యకు బెయిల్ ఇస్తూ కేసును డిసెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఐలయ్య విలేకరులతో మాట్లాడుతుండగా, ఆర్యవైశ్యులతో పాటు బీజేపీ నాయకులు ఇందూరి తిరుమలవాసు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులతో పాటు మరికొందరు ఐలయ్యకు మద్దతుగా నినాదాలు తెలుపుతూ పూలుచల్లారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్య కారును ఆర్యవైశ్య వర్గీయులు అడ్డుకున్నారు.
శ్రీపతి నాగ భూషణం అనే యువకుడు చెప్పు విసరగా.. అది న్యాయవాది కంతి మోహన్‌రెడ్డికి తగిలింది. ఆగ్రహం చెందిన శ్రీపతి నాగభూషణంను కొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణి గింది. కాగా, జగిత్యాలలో ఐలయ్య బస చేసిన హోటల్ వద్ద ఆయనపై కోడిగుడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఓ ఆర్యవైశ్యుడు ఐలయ్య కారుపై చెప్పు విసిరేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment