ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టో! | Sakshi Guest Column On BJP Politics On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టో!

Published Wed, Apr 5 2023 12:49 AM | Last Updated on Wed, Apr 5 2023 12:49 AM

Sakshi Guest Column On BJP Politics On Rahul Gandhi

లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ బీజేపీ భావజాల కథనాల్లో ఓబీసీలుగా ఎలా మారిపోయారు? ఈ జాతి వ్యతిరేక శక్తులు ఓబీసీలు అయినట్లయితే,మొత్తం ఓబీసీ సమాజం నిజంగా సిగ్గుపడాలి. ఓబీసీ రిజర్వేషన్‌ల కోసం జరిగిన పోరాటంలో ఏ కీలక సమయంలోనూ ఓబీసీ ఎజెండాను బీజేపీ బలపర్చలేదు. కానీ రాహుల్‌ గాంధీని ఎదుర్కోవడానికి దేశంలో మోదీ పేరు పెట్టుకున్నవారందరినీ బీజేపీ ఓబీసీలుగా మార్చేసింది. మోదీ ఇంటి పేరుగా కలిగిన వారందరూ ఓబీసీలేనని వీరు ఎలా సమర్థించుకుంటారు? మోదీ పేరు కలిగిన వారు చాలామంది దేశంలో పరిశ్రమలను పెట్టారు.కానీ వీరిలో ఏ ఒక్క మోదీ కూడా ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌కు మద్దతివ్వలేదు.

రాహుల్‌ గాంధీ ఒక స్వయంప్రకటిత బ్రాహ్మణుడు. నరేంద్ర మోదీ ఒక ధ్రువీకృత ఓబీసీ. వీరి జీవిత చరిత్రల్లో ఈ వాస్తవం  నిరాకరించలేనిది. కానీ లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ న్యాయస్థానంలోనూ, బీజేపీ భావజాల కథనాల్లోనూ ఓబీసీలుగా ఎలా మారిపోయారు? కర్ణాటకలో లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, నరేంద్ర మోదీ అని మూడు పేర్లను రాహుల్‌ పేర్కొన్నారు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ విదేశాల నుంచి హవాలా ద్వారా డబ్బును దొంగిలించి, చట్టవిరుద్ధంగా భారత్‌ నుంచి పరారై, లండన్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరికీ భారీ అంతర్జాతీయ బిజినెస్‌ నెట్‌వర్కులు ఉన్నాయి. వీళ్లకు ఓబీసీ ధ్రువపత్రాలు కూడా ఉన్నాయా?

ఉద్దేశపూర్వక ప్రచారం
మార్చి 23 ఉదయం నుంచి టీవీ ఛానల్స్, సోషల్‌ మీడియా వేదికల్లో బీజేపీ నేతలు... ఓబీసీలను దూషించడం రాహుల్‌ గాంధీ అలవాటుగా మార్చుకున్నారంటూ భారీ ప్రచారం మొదలెట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ఓబీసీల పట్ల ప్రేమ కురిపించలేదని నాకు తెలుసు. జాతీయ స్థాయిలో మండల్‌ అనుకూల ఓబీసీ నేత ఎవరినీ కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత స్థాయిలో ప్రోత్సహించలేదు.

కానీ ఆ పార్టీని దెబ్బ గొట్టడానికి లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ ఎలా ఓబీసీలు అయి పోయారు? మార్చి 24వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చలో బీజేపీ ప్రభుత్వంలోని ఓబీసీ మంత్రి భూపేంద్ర యాదవ్‌ నోటి నుంచి లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ ఓబీసీలు అయిపోవడం తొలిసారిగా విన్నాను.

ఆ తర్వాతి నుంచి బీజేపీ వాదనలన్నింటిలోనూ అన్ని దశల్లోనూ ఇదే వినిపించింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర సీనియర్‌ మంత్రులు దీన్నే పునరావృతం చేశారు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీలు ఇద్దరూ ఓబీసీలే అయినట్లయితే, మొత్తం ఓబీసీ సమాజం నిజంగా సిగ్గుపడాలి. 

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఓబీసీ కార్డును బీజేపీ జాగ్రత్తగా ఉపయోగించడం ప్రారంభించిందని నాకు తెలుసు. ఎందుకంటే దేశంలో ఓబీసీలు మాత్రమే ఏకైక అతిపెద్ద ఓటు బ్యాంక్‌ శక్తిగా ఉంటున్నారు. ఇది మాత్రమే బీజేపీని అధికారంలో ఉంచ గలదు.మండల్‌ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఆరెస్సెస్, బీజేపీ సాగించిన ఓబీసీ వ్యతిరేక ఉద్యమ చరిత్రను దేశంలో ఏ ఓబీసీ నేత కూడా ఎండగట్టలేదు.

ఓబీసీ రిజర్వేషన్‌ల కోసం జరిగిన పోరాటంలో ఏ కీలక సమయంలోనూ ఓబీసీ ఎజెండాను బీజేపీ బలపర్చలేదు. కానీ రాహుల్‌ గాంధీని ఎదుర్కోవడానికి దేశంలో మోదీ పేరు పెట్టుకున్నవారందరినీ బీజేపీ ఓబీసీలుగా మార్చేసింది. మోదీ ఇంటి పేరుగా కలిగిన ప్రతి ఒక్కరూ ‘మోధ్‌–ఘాంచీ–తేలీ’ కులం నుంచే వచ్చారా? బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కుల జనగణనలో దీనికి సాక్ష్యం ఎక్కడ ఉంది?

ఒక్క అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రమే బీజేపీ ఓబీసీ మాయమాటల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రి అధికార నివాసాన్ని తాను ఖాళీ చేశాక, గంగాజలంతో దాన్ని శుద్ధి చేయడం ద్వారా తన శూద్ర ఓబీసీ నేపథ్యాన్ని రాజ్‌పుత్‌ (క్షత్రియ) అయిన యోగీ ఆదిత్యనాథ్‌ అవమానించారని అఖిలేశ్‌ పదే పదే చెబుతూ వచ్చారు. బీజేపీ కానీ, ప్రత్యేకించి ఓబీసీ ప్రధానమంత్రి కానీ తమ సొంత పార్టీ సీఎం పాటిస్తున్న ఇలాంటి అమానుషమైన కుల ఆచరణలను ఎన్నడూ వ్యతిరేకించిన పాపాన పోలేదు.

ఓటు బ్యాంకు కోసమే!
రాహుల్‌ లేదా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓబీసీలకు అవమానం జరిగిందనే కొత్త కథనాన్ని ప్రచారం చేయడం... ‘రామచరిత మానస్‌’లో శూద్ర/ఓబీసీలకు వ్యతిరేకంగా భాష ఉందన్న నేపథ్యంలోని ఓటు బ్యాంక్‌ను ఉత్తరప్రదేశ్‌లో నిలబెట్టుకోవడానికేనా? ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్‌ సర్‌సంచాలక్‌ మోహన్‌ భాగవత్‌  కులాన్ని దేవుడు సృష్టించలేదని మాట్లాడారు. కుల సమస్యపై శాస్త్రాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు.

కులం అనేది ఉనికిలోనే లేదన్న చందంగా, కాంగ్రెస్‌ మేధా శక్తులు ఎన్నడూ కులం గురించి మాట్లాడలేదన్నది నిజం. లౌకికవాద శక్తులను వ్యతిరేకించడంలో భాగంగా ఆరెస్సెస్‌–బీజేపీ హిందూ మతం చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు అధికారాన్ని కోల్పోకుండానే కుల సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఓబీసీ జాబితాలోకి లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ వంటి జాతి వ్యతిరేక శక్తులను తేవడం ద్వారా ఓబీసీ జాతీయవాద కథనాన్ని ఎలా ఆచరణలోకి తెస్తారు?

మోదీ ఇంటిపేరుగా కలిగిన వారందరూ ఓబీసీలేనని వీరు ఎలా సమర్థించుకుంటారు? మోదీ పేరు కలిగిన వారు చాలామంది దేశంలో పరిశ్రమలను పెట్టారు. కానీ వీరిలో ఏ ఒక్క మోదీ కూడా ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌కు మద్దతివ్వలేదు.

ప్రైవేట్‌ రంగంలో ఎంతో కొంత రిజర్వేషన్‌ ఉండాలని యూపీఏ ప్రభుత్వం కనీస ప్రతిపాదన చేసింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలో ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ గురించి వాటాదారులకు నచ్చ జెప్పడానికి ఒక కమిటీని వేశారు. అలాంటి ప్రతిపాదనను అన్ని పెద్ద పరిశ్రమలూ వ్యతిరేకించాయి. ఓబీసీ ప్రధాని కేంద్రంలో గద్దెనెక్కిన తర్వాత అలాంటి రిజర్వేషన్‌ కోసం ఆరెస్సెస్, బీజేపీ ప్రతిపాదించిన పాపాన కూడా పోలేదు. పరిశ్రమలను కలిగి ఉన్న ఏ మోదీ కూడా ఓబీసీలకు మద్దతివ్వడం కానీ, ఉద్యోగాలను ప్రతిపాదించడం కానీ చేయలేదు.

వైఖరి వెల్లడించాలి!
ఈ దేశ పీడిత ప్రజారాశులను వంచించడానికి కుల ప్రతిపత్తిని తారుమారు చేయలేము. దేశంలోని ముఖ్యమైన ఓబీసీలు శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల ప్రజారాశులకు సంబంధించినవారు. ఆధు నిక పరిశ్రమకు ముందు, గానుగ ఆడించి నూనె తీసే వర్గం చేతివృత్తుల కులంగా ఉండేదనడంలో సందేహమే లేదు. అయితే దీన్ని మోదీ ఇంటిపేరుతో ముడిపెట్టలేము. దీని ఆధారంగా చట్టబద్ధమైన లేక సామాజిక వాదనను నిర్మించలేము. ఉదాహరణకు, అనేక కమ్యూని టీల్లో చౌదరి ఇంటిపేర్లు ఉన్నాయి.

భారతదేశంలోనూ, అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లోనూ కుల వ్యతిరేక చట్టాలను ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్‌ అధికారిక పత్రిక ‘పాంచజన్య’తోపాటు, ఆరెస్సెస్‌ కీలక నేతల్లో ఒకరైన రామ్‌ మాధవ్‌ అమెరికా, కెనడాల్లో తెచ్చిన కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రాశారు. మన దేశంలో మాత్రం ఎన్ని కలు, ఓట్ల ప్రయోజనం కోసం వీరు ఓబీసీ ఎజెండాను ఉపయోగించుకుంటున్నారు.

ఓబీసీ ట్యాగ్‌ ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని కావడానికి అనుమతించడం అనే వాస్తవాన్ని మినహాయిస్తే, భారతదేశంలోని ఓబీసీల ప్రయోజనాల కోసం ఆరెస్సెస్, బీజేపీ ఎలాంటి నిర్దిష్ట చర్యలూ చేపట్టలేదు. ఓబీసీ అంశంపై ఆరెస్సెస్, బీజేపీ వైఖరి గురించి జాతీయ స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 

అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా ఓబీసీ అంశంపై ఎలాంటి సీరియస్‌ సానుకూల ఆచరణ, వైఖరిని కలిగిలేదన్నది వాస్తవం. అయితే ఆరెస్సెస్, బీజేపీ ఉపయోగించుకున్నట్లుగా ఓబీసీ కార్డును కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ ఉపయోగించుకోలేదు. ఈ ధోరణి కనుక ఇలాగే కొనసాగినట్లయితే, ఓబీసీలు భారీగా నష్టపోతారు.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌ 

వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement