
సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచారనే నెపంతో ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, సంఘ్‌పరివార్ నేతృత్వంలోనే దేశంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కులం గురించి మాట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడటం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని జగన్ ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి ఐలయ్య పుస్తకాలను నిషేధించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు. అభిప్రాయాలను, అక్షరాలను నిషేధించాలనుకునే నియంతృత్వ వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయొచ్చని, అయితే బెదిరించడం అప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు. ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతిస్తోందని, ప్రజాస్వామ్యవాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.