గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’ పుస్తకంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలకాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఆర్యవైశ్య సంఘం, దళిత సంఘాల నేతలతో శనివారం విజయవాడలో కీలక సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత పుస్తకంపై తలెత్తిన వివాదానికి, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఉమ్మడిగా అంగీకార ప్రకటన రూపొందించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అవాంఛనీయ పరిణామాలు, వివాదాలకు ముగింపు పలకాలని ఇరుపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న కంచ ఐలయ్యతో ఫోన్‌లో సంప్రదించామన్నారు. ఇకపై జరిగే సభలు, సమావేశాల్లో ఆర్యవైశ్య కులం గురించి తాను మాట్లాడబోనని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, వ్యాపార, సామాజిక రంగాల ప్రైవేటీకరణపైనే తాను మాట్లాడదలచుకున్నానని చెప్పారన్నారు. తాను 2009లో ప్రచురించిన ‘సామాజిక స్మగ్లర్లు– కోమటోళ్లు’ పుస్తకం రిజర్వేషన్ల అంశం చర్చించడానికి ఉద్దేశించి రాసినదేనని వివరించారన్నారు. పుస్తకంలో ఉన్న అంశాలపై బాధ్యత కలిగిన ప్రజాసంఘాల నాయకులు, వైశ్యసంఘం నాయకుల సమక్షంలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఫోన్ సంభాషణలో తెలిపారని రామకృష్ణ చెప్పారు.
పుస్తకంలోని వివాదాస్పద అంశాలను పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కరించాలని సమావేశంలో పాల్గొన్న పెద్దలు అభిప్రాయపడినట్లు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలపై పెద్దలతో చర్చించేందుకు కంచ ఐలయ్య అంగీకరించిన నేపథ్యంలో వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామన్నారు. ఈ విషయమై ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వంటి పెద్దలతో చర్చించి అంగీకార ప్రకటన చేసినట్లు చెప్పారు. త్వరలోనే కంచ ఐలయ్యతో ఆర్యవైశ్య పెద్దలు సమావేశమవుతారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, సామాజిక హక్కుల వేదిక నాయకుడు పోతుల సురేష్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ ఎల్ జైబాబు, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు బుట్టి రాయప్ప పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్‌తో భేటీ
పుస్తక వివాదం, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలు విజయవాడలో శనివారం ఒకేరోజు పోటాపోటీగా సభల నిర్వహణకు పూనుకోవడం, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఏర్పడిన ఉత్కంఠకు తాజా పరిణామాలతో తెరపడినట్టయింది. కాగా ఇరు వర్గాల నేతలు శనివారం రాత్రి విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌తో భేటీ అయ్యారు. పరస్పరం మాట్లాడుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.
ఐలయ్య ఇంటివద్ద ఉద్రిక్తత
ఐలయ్య విజయవాడలో జరిగే సభకు వెళ్లకుండా నిరోధించేందుకు హైదరాబాద్ తార్నాకలోని ఆయన ఇంటిని ఉస్మానియా వర్సిటీ పోలీసులు దిగ్బంధించారు. ఐలయ్య ఇంటికి వెళ్లే రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఐలయ్య ఇంటి వద్దకు చేరుకున్న టీ–మాస్ ప్రతినిధులు విమలక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, నలిగంటి శరత్, దళిత సంఘర్షణ సమితి ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కాగా ఐలయ్య తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని, తన పోరాటం కులాలకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఇలావుండగా కంచ ఐలయ్యకు సంఘీభావంగా విజయవాడ వెళ్లేందుకు యత్నించిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావును, ఇతర నేతలను గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఐలయ్యకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఐలయ్య వివాదానికి ఇక ముగింపు
Published Sun, Oct 29 2017 3:05 AM | Last Updated on Sun, Oct 29 2017 3:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment