విశ్లేషణ
మంచి పంటలు పండే 30 వేల ఎకరాల భూమిలో అమరావతి నగర నిర్మాణమనే లాభసాటి దారి పట్టాడు చంద్రబాబు. అత్తారింటికి దారి వెతికే నటుడేమో పిల్లలకు యూట్యూబ్‌లుండగా బడులెందుకు అని ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని బీజేపీ చెబుతున్నది. ఈ మూడు దారులూ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటయ్యాయి. ఇక జగనేమో విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించే బాట పట్టాడు. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు మూడు విచిత్ర దారుల కలయిక జరిగింది. ఒకటి అమరావతికి దారి. ఆ దారి ఏది, ఏది అని 2019 నుండి చంద్రబాబు వెతుకుతున్నాడు. ఈయన దారి తప్పడమనేది 2014లోనే జరి గింది. రాష్ట్రానికి హైదరాబాదును మించిన రాజధాని తను, తన కొడుకు దశాబ్దాలు పాలించి అతి త్వరలోనే సింగపూర్ లాంటి సిటీ కడుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కృష్ణానది ఒడ్డున బంగారు పంటలు పండే 30 వేల ఎకరాల భూమిని రైతుల దగ్గరి నుండి తీసు కున్నారు. అప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా ఈ దారి తప్పిన దారిలో ఉంది.
ఈ భూముల్లో మంచి పంటలు పండించుకునే రైతుల్ని అతి త్వరలోనే పెట్టుబడిదారులను చేస్తామని ఆశ పెట్టారు. ఇది విచిత్ర ఆశ. ఆ రైతులెలా నమ్మారోగానీ ఒక చిన్న రాష్ట్రం 30 వేల ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించి, బాగా పంటలు పండే ఖరీదైన ఎకరా భూమికి బదులు 200 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తామంటే ఎలా నమ్ము తారు? ఇక ఆ ఐదేండ్లలో సింగపూర్ నగర నిర్మాతలు రాష్ట్ర బడ్జెట్‌నంతా ఇతర దేశాల కాంట్రాక్ట్ బృందాలకు, మంత్రివర్గ కమిటీలు ప్రపంచ పట్టణాల నమూనాల అధ్యయనానికి ఖర్చు చేశారు.
నగర నిర్మాణం జరగకముందే దాని చుట్టూ రింగురోడ్లు, ఉద్యానవనాలు తయారౌతున్నట్టు ప్రకటించారు. వీటి నమూనాలు గీయడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి 2019 ఎన్నికలు వచ్చే నాటికి అమరావతికి దారేది? అనే స్థితిలో చంద్రబాబు ఆయన ప్రయివేటు విద్యా, వైద్య మంత్రివర్గ మిత్ర బృందం ఎన్నికలకు పోయింది. ఘోరంగా ఓడారు. ఇప్పుడు అత్తారింటికి దారేది? అని నిరంతరం వెతికే నాయకుడు లేని నాటకదారితో పొత్తు కుదుర్చుకున్నాడు బాబు.
ఈ అత్తారింటికి నిరంతరం దారి వెతికే నటుడు పిల్లలకు యూట్యూబ్‌లుండగా బడులెందుకు, సినిమాలుండగా రైతులకు వ్యవసాయం పనులెందుకు, వెల్‌ఫేర్ స్కీములెందుకు? అని ప్రజల బతుకుదారులన్నీ మూసెయ్యాలని ఎన్నికల ముందే ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. ఈ ఇద్దరు కలిసి తమ విచిత్ర దారుల కలయిక చాలద న్నట్లు మళ్లీ బీజేపీని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని చాలా కాలంగా బీజేపీ చెబుతున్నది. వీళ్లంతా కలిసి పోటీ చేసి గెలిస్తే, రాష్ట్ర బడ్జెట్‌ను ఏ దారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనే కొట్లాట మొదలౌతుంది.
చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలంటాడు. 30 వేల ఎకరాలతో సింగపూర్లు నిర్మించాలి! పవన్ తన కల్యాణం కోసం ఖర్చు చేయాలంటాడు. ఆయనకు అత్తారింటి దారి వెతుకులాట, ఆ దారిలో ఖర్చు చేయడం తప్ప ప్రజల అభివృద్ధి దారి, పిల్లల బడి దారి, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ విద్య, ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ వంటివి ఆయన నటనా జీవితంలో ఎరుగనివి. బీజేపీతో పొత్తు కుదిరింది కనుక అది గుడుల నిర్మాణం, పురాతన సంప్రదాయ చరిత్ర పరిరక్షణ, అభివృద్ధి, విశ్వగురుపీఠ ఏర్పాటు అమెరికాలో చేయాలనే ఆశయ సాధనకు డబ్బు ఖర్చు చెయ్యాలనే డిమాండ్ చేయడం మామూలే.
జగన్ పరిపాలించిన ఐదేండ్లు ఏక కేంద్ర నిర్ణయాలు, ఖర్చు అభివృద్ధి ప్లాన్లు జరిగాయి. అందులో మొదటిది, అసాధ్యమైన 30 వేల ఎకరాల నగర నిర్మాణం ఆపడం; అది ఆపకుండా ప్రజల కోసం ఏ ఖర్చూ చెయ్యలేమని గుర్తించడం. రెండవది విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించటం; భవన నిర్మాణ ఖర్చును పట్టణ నిర్మాణ రంగం నుండి పల్లె నిర్మాణ రంగంలోకి మార్చడం; గ్రామాల్లో బడుల భవనాలు, హాస్పిటళ్లు, సెక్రటేరియట్లు నిర్మించడం; ఈ నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్ల నుండి గ్రామ కాంట్రాక్టర్లకు మార్చడం; అందులో ముఖ్య గ్రామ ప్రజా కమిటీలకు నిర్మాణ బాధ్యతలు ఒప్ప జెప్పడం. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం చాలా ఉంటుంది.
ఇంతకంటే పెద్ద రిస్కుతో కూడిన నిర్ణయం ప్రభుత్వ విద్యా విధానాన్ని ఆంగ్ల ప్లస్ తెలుగుతో జతపర్చి ఆధునిక విద్యా టెక్నాలజీని శ్రమ జీవుల పిల్లల బతుకుల్లోకి తీసుకెళ్లటం. ఇది భారతదేశం వంటి ప్రయివేటు విద్యా పెట్టుబడి–దోపిడీ వ్యవస్థ ఏ దేశంలో లేనంత బలంగా ఉన్న చోట ప్రయోగాత్మకంగానైనా చెయ్యడం ఊహకందనిది.
ఇది విద్యా దోపిడీ, ప్రయివేటు పెట్టుబడుల డబ్బు విస్తరించి ఉన్న ఆస్తులు, వాటి చుట్టూ ఉన్న మాఫియాను బాగా బలహీనపర్చే నిర్ణయం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటేనే ఉగ్రరూపం దాల్చే ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం మాఫియాతో నేరుగా తలప డటం. ఈ మాఫియాకు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు దాసోహం చేసే రోజులివి.
కార్మిక వర్గ రక్షకులమనే కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రయివేటు విద్యా మాఫియాను అంటకాగి బతుకుతూ ఉన్న దశ ఇది. ప్రయివేటు విద్యా రంగం ఈ దేశంలో మిగతా అన్ని పెట్టుబడిదారీ రంగాలను మించిన ఆస్తుల్ని, మంది మార్బలం, బస్సులు, కార్లు, వ్యాన్లు కలిగి ఉండి మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించి ఉన్నందువల్ల దీని శక్తి ఉత్పత్తి రంగ పెట్టుబడి కంటే బలమైంది.
దీన్ని ఎదిరించలేకనే అన్ని రాజకీయ పార్టీలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలతో సహా, ఊకదంపుడు ‘మాతృభాష’ సిద్ధాంతం ప్రజలకు నేర్పి తమ పార్టీలను, తమ పిల్లల మెదళ్లను ప్రయివేటు విద్యా వ్యవస్థకు తాకట్టు పెట్టాయి. జగన్ దాన్ని బద్దలు కొట్టారు. ఇది మామూలు విషయం కాదు. భారతదేశ జ్ఞాన సంపద రూపు రేఖల్ని మార్చే పోరాటం ఇది.
ప్రజా సంక్షేమ వ్యవస్థను భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వంగాని, ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఊహించని స్థాయిలో ‘మనీ ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో ప్రజా బ్యాంకు ఎకౌంటుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసింది జగన్ ప్రభుత్వం. ఇటువంటి స్కీములను ఈ మూడు పార్టీల కూటమి కూడా చేస్తామనొచ్చు. కానీ అన్ని సమస్యలకు, ముఖ్యంగా విశాల ప్రజల బీదరికానికి మందు జగన్ ప్రారంభించిన క్వాలిటీ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వం ఇవ్వడంలో ఉన్నది.
దానికి బద్ధ శత్రువు చంద్రబాబు, పచ్చి వ్యతిరేకి బీజేపీ, పిచ్చి వ్యతిరేకి పవన్. వీళ్లంతా ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం విద్యా పెట్టుబడిదారీ వర్గాన్ని తమ భుజాల మీద మోస్తారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మొదట ఆగి పోయేది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్త పాఠ శాలల నిర్మాణం. ఇప్పటికే నిర్మించబడ్డ బడులకు మెయింటనెన్స్ డబ్బు ఆపివేత, మిర్రర్ ఇమేజ్ బుక్స్ ప్రింటింగ్ ఆపివేత.
సంక్షేమాలు ఎన్ని చేస్తామని చెప్పినా 30 వేల ఎకరాల్లో సింగపూర్ నిర్మాణం కార్యక్రమం అన్నింటినీ ఆపేస్తుంది. అమరావతి భారీ నగర నిర్మాణ సమస్య ఈ మూడు పార్టీల మెడకు చుట్టుకున్న పెద్ద నాగు పాము. బాబు నిర్మించే పట్టణ పాముకు సరిపోయేన్ని పాలు వీరు పొయ్యకపోతే అది వీరిని కాటేసి చంపేస్తుంది. దానికి గ్రామాలను మాడ్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒకే ఒక పరిష్కారముంది.
అది ఈ ఎన్నికల్లో జగన్‌ని గెలిపించుడు. కనీసం ఇంకో ఐదేండ్లు విద్యా రంగం మార్పులతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగించు కుంటే క్రమంగా ఇటువంటి పథకాలు అవసరం లేని దేశంలోనే అభి వృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ మూడు దారుల కూటమే వస్తే మళ్లీ అగాథంలో ఆంధ్రప్రదేశ్ పడుతుంది. బాబు భయ మంతా గ్రామాల్లోని కూలీ నాలీ చేసుకొని బతికే వారి పిల్లలు మేధా వులు, నాయకులు అయితే తన కొడుకు, మనవడు ఏమౌతారనే. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment