ఉనికి కోల్పోయిన ‘తనిఖీ’
ప్రభుత్వ పాఠశాలల్లో లోపిస్తున్న జవాబుదారీ తనం
పని చేయని ఎస్‌ఎంసీ కమిటీలు
జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు
అవగాహన లేక పట్టుకోల్పోతున్న కమిటీలు
ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి ఉండదు. సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పాఠశాలల పనితీరు, అభివృద్ధి, విద్యాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి తరచూ ఆయా పాఠశాలలను కమిటీలు తనిఖీలు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏర్పాటైన పాఠశాల కమిటీలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి.
- గుమ్మఘట్ట:
జిల్లాలో 2,650 ప్రాథమిక పాఠశాలల్లో 1.60 లక్షల మంది, 600 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 70 వేల మంది, 610 ఉన్నత పాఠశాలల్లో 76 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్తు ఆయా పాఠశాలల తనిఖీలపైనే ఆధారపడి ఉంది.
తనిఖీలు ఎలా ఉండాలంటే..
పాఠశాల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ఉన్నాయి? వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? వంటి విషయాలపై తనిఖీదారులకు ముందస్తుగానే అవగాహన ఉండాలి. అదే సమయంలో సిబ్బంది నియామకం, వారి పనితీరు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్వహణ, హాజరు శాతం పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం తదితర విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి నెలలో మూడో శనివారం విధిగా సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్దికి సంభందించి చర్చ జరగాలి. అందుకు కావాల్సిన నిధుల కోసం నివేదికలు సిద్దం చేయాలి. ఇలాంటివి జరగడమే లేదు.
శిక్షణనే మరిచారు..
ఎస్‌ఎంసీలను నియమించిన ప్రభుత్వం.. అందులోని సభ్యులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం విస్మరించింది. ఎస్‌ఎంసీల బాధ్యతలు తదితరాలపై నేటికీ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిపామని రికార్డులు చూపారే తప్పా ప్రాథమికంగా సభ్యులకు వారి బాధ్యతలపై అవగాహన లేదు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లి,దండ్రులు, సంరక్షులను సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 3,860 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మెన్, మేయర్ తమ విచక్షణ మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు.
బహుళ ప్రయోజనాలు...
ఎస్‌ఎంసీల పనితీరు మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే అవగాహన ప్రజలు, తల్లి,దండ్రుల్లో పెరుగుతుంది. ప్రధానోపాధ్యాయులలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో భాగంగానే రెండ్రోజలు క్రితం సనప ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ గొడవ కారణంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందని విషయంపై కమిటీ పర్యవేక్షణలో వెలుగు చూసింది. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేసి పథకాన్ని పునరుద్ధరించారు. అలాగే సనప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ నెలకొన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయుడికి మెమో ఇప్పించి, పరిష్కారానికి కమిటీ చొరవ చూపింది.
పాఠశాల యాజమాన్య కమిటీలు చురుగ్గా పాల్గొనాలి
పాఠశాల యాజమాన్య కమిటీలు వారి హక్కులను ముందుగా తెలుసుకోవాలి. చురుగ్గా పాల్గొని లోపాలను గుర్తించి సరిచేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అవగాహన కూడా కల్పించాం. ఎస్‌ఎంసీలకు తోడు మండల విద్యాధికారుల పర్యవేక్షణ పెంచితే ఉపాధ్యాయులు వేళకు రావడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్‌ఎంసీలకు వారి విధులపై అవహన పెంచేలా సదస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం.
– లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం