Schools Management
-
తగని వసతులు లేని చదువులా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్‌ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్ లేదా ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు? ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్‌ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది. అశోక్ ధనావత్, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్మెంట్ స్టడీస్ విద్యార్థి ది హేగ్, నెదర్లాండ్స్ -
మీ ఓటే.. మా భవిష్యత్తు
ఆదిలాబాద్‌టౌన్: ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు వేసే ఓటుతో మా భవిష్యత్తు ముడిపడి ఉందని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులను కోరుతున్నారు. ఓటు అనే ఆయుధం గురించి విద్యార్థులు పూర్తి స్థాయిలో తెలుసుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో అమ్మానాన్నకు అర్థమయ్యే రీతిలో ఓటు ప్రాముఖ్యత వివరిస్తున్నారు. విద్యార్థులకు ఓటు వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఓటు అంశంపై జిల్లాలోని ఆయా పాఠశాలల్లో క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో, డైట్ కళాశాలల్లో మాదిరి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటింగ్ యంత్రం, వీవీ ప్యాట్ గురించి తెలియజేస్తున్నారు. ఓటు అనే ఆయుధంతోనే సమాజంలో మార్పు తీసుకురాగలమనే విషయాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. విద్యార్థులకు పోటీలు.. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధి కారి, ఇద్దరు పీఓలు, ముగ్గురు ఏజెంట్లు, ఒక పో లీసు కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇద్దరు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సెక్టార్ అధికారి, పది మంది ఓటర్లు పాత్రల్లో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నారు. శని వారం నుంచి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు అందజేయనున్నా రు. 25న జిల్లా స్థాయిలో జెడ్పీ సమావేశ మం దిరంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7,500, తృతీయ బహుమతి రూ.5వేల నగదుతో పాటు షీల్డ్ అందజేస్తారు. నిజ జీవితంలో నేనే రాజకీయ నాయకుడిని అయితే అనే అంశంపై ఇద్దరు విద్యార్థులతో డిబేట్ నిర్వహిస్తారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు లేఖలు రాసి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఓ సారి ఆలోచించి ఓటు వేయాలని, ఓటుతో మాకేమి పని అంటూ నిర్లక్ష్య ధోరణిని వీడాలని కోరుతున్నారు. డిసెంబర్ 7న ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ లేఖలో రాయిస్తున్నారు. ఉత్తమ లేఖ రాసిన పది మందికి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. -
ఉనికి కోల్పోయిన ‘తనిఖీ’
ప్రభుత్వ పాఠశాలల్లో లోపిస్తున్న జవాబుదారీ తనం పని చేయని ఎస్ఎంసీ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు అవగాహన లేక పట్టుకోల్పోతున్న కమిటీలు ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి ఉండదు. సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పాఠశాలల పనితీరు, అభివృద్ధి, విద్యాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి తరచూ ఆయా పాఠశాలలను కమిటీలు తనిఖీలు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏర్పాటైన పాఠశాల కమిటీలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. - గుమ్మఘట్ట: జిల్లాలో 2,650 ప్రాథమిక పాఠశాలల్లో 1.60 లక్షల మంది, 600 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 70 వేల మంది, 610 ఉన్నత పాఠశాలల్లో 76 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్తు ఆయా పాఠశాలల తనిఖీలపైనే ఆధారపడి ఉంది. తనిఖీలు ఎలా ఉండాలంటే.. పాఠశాల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ఉన్నాయి? వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? వంటి విషయాలపై తనిఖీదారులకు ముందస్తుగానే అవగాహన ఉండాలి. అదే సమయంలో సిబ్బంది నియామకం, వారి పనితీరు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్వహణ, హాజరు శాతం పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం తదితర విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి నెలలో మూడో శనివారం విధిగా సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్దికి సంభందించి చర్చ జరగాలి. అందుకు కావాల్సిన నిధుల కోసం నివేదికలు సిద్దం చేయాలి. ఇలాంటివి జరగడమే లేదు. శిక్షణనే మరిచారు.. ఎస్ఎంసీలను నియమించిన ప్రభుత్వం.. అందులోని సభ్యులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం విస్మరించింది. ఎస్‌ఎంసీల బాధ్యతలు తదితరాలపై నేటికీ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిపామని రికార్డులు చూపారే తప్పా ప్రాథమికంగా సభ్యులకు వారి బాధ్యతలపై అవగాహన లేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లి,దండ్రులు, సంరక్షులను సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 3,860 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మెన్, మేయర్ తమ విచక్షణ మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బహుళ ప్రయోజనాలు... ఎస్‌ఎంసీల పనితీరు మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే అవగాహన ప్రజలు, తల్లి,దండ్రుల్లో పెరుగుతుంది. ప్రధానోపాధ్యాయులలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో భాగంగానే రెండ్రోజలు క్రితం సనప ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ గొడవ కారణంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందని విషయంపై కమిటీ పర్యవేక్షణలో వెలుగు చూసింది. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేసి పథకాన్ని పునరుద్ధరించారు. అలాగే సనప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ నెలకొన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయుడికి మెమో ఇప్పించి, పరిష్కారానికి కమిటీ చొరవ చూపింది. పాఠశాల యాజమాన్య కమిటీలు చురుగ్గా పాల్గొనాలి పాఠశాల యాజమాన్య కమిటీలు వారి హక్కులను ముందుగా తెలుసుకోవాలి. చురుగ్గా పాల్గొని లోపాలను గుర్తించి సరిచేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అవగాహన కూడా కల్పించాం. ఎస్ఎంసీలకు తోడు మండల విద్యాధికారుల పర్యవేక్షణ పెంచితే ఉపాధ్యాయులు వేళకు రావడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్ఎంసీలకు వారి విధులపై అవహన పెంచేలా సదస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. – లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం -
సెలవు దినాల్లోనూ పాఠశాలల నిర్వహణా..?
మచిలీపట్నం : సెలవు దినాల్లోనూ అధికారులు పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల బాగోగులను పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో అధిక పనిగంటల కారణంగా విద్యార్థులపై మానసిక ప్రభావం చూపుతోందనే వాదన వినబడుతోంది. ఉత్తమ ఫలితాల సంగతి అలా ఉంచితే విద్యార్థులపై మానసికంగా పడే భారాన్ని అధికారులు పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. సెలవు దినాల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఉదయం పిల్లలు ఏం తిని వస్తున్నారు.. మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమేర పోషకాలు ఉన్న ఆహారాన్ని సమకూర్చుతున్నాం.. అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అన్ని గంటల పాటు ఏకధాటిగా చదివితే విద్యార్థి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపడంతోపాటు అభ్యాసనా శక్తి తగ్గిపోతుందని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. పోషకాహారం అందిస్తారా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట వంతున అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇదే పద్ధతి కొనసాగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 20,750 మంది ఉన్నారు. వీరికి ఈ ఏడాది జనవరి 27 నుంచి మార్చి 25వ తేదీ వరకు పోషకాహారం అందించేందుకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ. 58.10 లక్షలను విడుదల చేశారు. 40 రోజుల పాటు పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్వహించిన సమయంలో విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటలకు అరటిపండు, క్రీమ్బిస్కట్లు, పోషక విలువలుగల మొలకెత్తిన విత్తనాలు ఇస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు ఏడు రూపాయల వంతున ఖర్చు చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మన జిల్లాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కొన్నిచోట్ల డీవైఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు ముందుకు వచ్చి ఈ ఖర్చును కొద్దిమేర మాత్రమే భరిస్తున్నారు. కృష్ణాజిల్లాలోనూ జెడ్పీ ద్వారా ఈ తరహా నిధులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. పనివేళలు మార్చారు, టైమ్‌టేబుల్ ఇవ్వలేదు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పాఠశాలల పనివేళలను మార్చారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇటీవల మళ్లీ పాఠశాలల పనివేళలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మారిన పనివేళలకు అనుగుణంగా టైమ్‌టేబుల్‌లో మార్పులు చోటుచేసుకోలేదు. ఏ సమయంలో ఏ పీరియడ్‌ను నిర్వహించాలనే అంశంపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి నూతన పాఠశాలల సమయాలకు అనుగుణంగా టైమ్ టేబుల్‌ను ప్రకటించాల్సి ఉందని.. దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించాలా.. పాఠశాలల పనిదినాల్లో ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆదివారం కూడా పాఠశాలలు పూర్తిగా నిర్వహించాలనే నిబంధన విధించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారుల నుంచి ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపారు. ఇది ఎంత వరకు సమంజసమని టీచర్లు అంటున్నారు. అందరి మాదిరిగానే విద్యార్థులకు వారంలో ఒక రోజైనా సెలవు అవసరమని వారు పేర్కొంటున్నారు. సెలవు దినాల్లోనూ అదనపు తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల చదువు ఎలా ముందుకు సాగుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
20వ తేదీలోగా సాక్షి స్పెల్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం టౌన్: సాక్షి ఇండియా స్పెల్ బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్పెల్‌బీ’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్పెల్‌బీలో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా, విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగల సెలవులు రావడంతో రిజిస్ట్రేషన్ల గడువును పెంపుదల చేయాలంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల కోరిక మేరకు ఈ నెల 20 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్లను త్వరితగతిన చేయించుకునేందుకు పాఠశాలల యజమానులు సిద్ధం కావాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వారు 9951602843 నంబరును సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.