మచిలీపట్నం : సెలవు దినాల్లోనూ అధికారులు పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల బాగోగులను పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో అధిక పనిగంటల కారణంగా విద్యార్థులపై మానసిక ప్రభావం చూపుతోందనే వాదన వినబడుతోంది. ఉత్తమ ఫలితాల సంగతి అలా ఉంచితే విద్యార్థులపై మానసికంగా పడే భారాన్ని అధికారులు పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. సెలవు దినాల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఉదయం పిల్లలు ఏం తిని వస్తున్నారు.. మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమేర పోషకాలు ఉన్న ఆహారాన్ని సమకూర్చుతున్నాం.. అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అన్ని గంటల పాటు ఏకధాటిగా చదివితే విద్యార్థి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపడంతోపాటు అభ్యాసనా శక్తి తగ్గిపోతుందని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.
పోషకాహారం అందిస్తారా
విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట వంతున అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇదే పద్ధతి కొనసాగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 20,750 మంది ఉన్నారు. వీరికి ఈ ఏడాది జనవరి 27 నుంచి మార్చి 25వ తేదీ వరకు పోషకాహారం అందించేందుకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ. 58.10 లక్షలను విడుదల చేశారు.
40 రోజుల పాటు పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్వహించిన సమయంలో విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటలకు అరటిపండు, క్రీమ్‌బిస్కట్లు, పోషక విలువలుగల మొలకెత్తిన విత్తనాలు ఇస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు ఏడు రూపాయల వంతున ఖర్చు చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మన జిల్లాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కొన్నిచోట్ల డీవైఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు ముందుకు వచ్చి ఈ ఖర్చును కొద్దిమేర మాత్రమే భరిస్తున్నారు. కృష్ణాజిల్లాలోనూ జెడ్పీ ద్వారా ఈ తరహా నిధులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పనివేళలు మార్చారు, టైమ్‌టేబుల్ ఇవ్వలేదు
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పాఠశాలల పనివేళలను మార్చారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇటీవల మళ్లీ పాఠశాలల పనివేళలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మారిన పనివేళలకు అనుగుణంగా టైమ్‌టేబుల్‌లో మార్పులు చోటుచేసుకోలేదు. ఏ సమయంలో ఏ పీరియడ్‌ను నిర్వహించాలనే అంశంపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి నూతన పాఠశాలల సమయాలకు అనుగుణంగా టైమ్ టేబుల్‌ను ప్రకటించాల్సి ఉందని.. దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించాలా..
పాఠశాలల పనిదినాల్లో ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆదివారం కూడా పాఠశాలలు పూర్తిగా నిర్వహించాలనే నిబంధన విధించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారుల నుంచి ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపారు. ఇది ఎంత వరకు సమంజసమని టీచర్లు అంటున్నారు. అందరి మాదిరిగానే విద్యార్థులకు వారంలో ఒక రోజైనా సెలవు అవసరమని వారు పేర్కొంటున్నారు. సెలవు దినాల్లోనూ అదనపు తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల చదువు ఎలా ముందుకు సాగుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
సెలవు దినాల్లోనూ పాఠశాలల నిర్వహణా..?
Published Mon, Feb 16 2015 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement