న్యూఢిల్లీ: మార్కెట్ పుకార్లు లేదా వార్తలు తదితరాలపై లిస్టెడ్ కంపెనీలు స్పందించవలసి ఉంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. అక్టోబర్ 1నుంచి డిస్‌క్లోజర్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వెరసి ఇకపై లిస్టెడ్ కంపెనీలు ప్రధాన మీడియా సంస్థలలో వెలువడే మార్కెట్ రూమర్లను ఖండించడం, లేదా స్పష్టతనివ్వడం వంటివి చేపట్టవలసి ఉంటుంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు ఆదేశాలు అక్టోబర్ 1నుంచి వర్తించనున్నట్లు సెబీ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ బాటలో టాప్–250 లిస్టెడ్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1నుంచి డిస్‌క్లోజర్ నిబంధనలు అమలుకానున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధాన మీడియాలో వచ్చే మార్కెట్ పుకార్లను ఖండించడం లేదా వివరణ ఇవ్వడం లేదా స్పష్టం చేయడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. అసహజరీతిలో పుట్టే పుకార్లు లేదా వార్తలు లేదా ఇతర సమాచారంపై కంపెనీలు 24 గంటల్లోగా స్పష్టతను ఇవ్వవలసి ఉంటుంది.
ప్రత్యేక హక్కులపై..
లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ పాలనను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా సెబీ ప్రత్యేక హక్కుల జారీపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా కొంతమంది ప్రధాన వాటాదారులకు నిరంతరంగా ప్రత్యేక హక్కులను కల్పించడంపైనా సెబీ దృష్టిపెట్టింది. లిస్టెడ్ కంపెనీలు ఎవరికి ఎలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినా సాధారణ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినప్పటినుంచి ప్రతీ ఐదేళ్లలో ఒకసారి ఇందుకు ప్రత్యేక పద్ధతిలో వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రమోటర్లు, వ్యవస్థాపకులు, ఇతర కార్పొరేట్ బాడీ సభ్యులకు ఇలాంటి ప్రత్యేక హక్కులను జారీ చేయడంపై కొంతకాలంగా సాధారణ వాటాదారులతోపాటు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు తెరతీసింది.
2024 ఏప్రిల్ నుంచి
సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై లిస్టెడ్ కంపెనీలు డైరెక్టర్ల ఎంపికలోనూ సాధారణ వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. 2024 ఏప్రిల్ 1నుంచి ఐదేళ్ల కాలంలో కనీసం ఒకసారైనా వాటాదారుల అనుమతి కోరవలసి ఉంటుంది. 2024 మార్చికల్లా బోర్డులోగల ఎవరైనా గత ఐదేళ్లలో వాటాదారుల నుంచి అనుమతి పొందకుంటే తప్పనిసరిగా అదే ఏడాది మార్చి 31 తదుపరి బోర్డును సమావేశపరచి వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందవలసి ఉంటుంది. కొనుగోళ్లు, షేర్ల కన్సాలిడేషన్, సెక్యూరిటీల బైబ్యాక్ తదితర మెటీరియల్ సమాచారాన్ని వెల్లడించే గడువును 24 గంటల నుంచి 12 గంటలకు కుదించింది. ఇదేవిధంగా డైరెక్టర్ల బోర్డు తీసుకునే నిర్ణయాలను సమావేశం ముగిసిన తదుపరి 30 నిమిషాలకు వెల్లడించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment