ముంబై: కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో వాటి అమలు తీరులో మాత్రం లోపాలు ఉన్నట్లు తేలిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాటిని అధిగమించగలిగామని, లేకపోతే ఎంతో కొంత ఒడిదుడుకులు తలెత్తేవని ఆయన పేర్కొన్నారు.
‘కార్పొరేట్ గవర్నెన్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులకు దారి తీసేలా కొన్ని బ్యాంకుల్లో గవర్నెన్స్‌పరమైన లోపాలు బైటపడటం ఆందోళనకరమైన విషయం‘ అని బ్యాంక్ బోర్డుల డైరెక్టర్లతో సోమవారం జరిగిన సమావేశంలో దాస్ పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, యాజమాన్యాలు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
స్మార్ట్ మోసాలు..
మొండిపద్దులపరమైన ఒత్తిళ్లను దాచి పెట్టేందుకు, కృత్రిమంగా ఆర్థిక పనితీరును గొప్పగా చూపించుకునేందుకు బ్యాంకులు ‘స్మార్ట్ అకౌంటింగ్’ విధానాలను ఆశ్రయించడాన్ని దాస్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇందుకోసం బ్యాంకులు పాటిస్తున్న విధానాలను ప్రస్తావించారు. ఖాతాల్లో మొండిబాకీల భారాన్ని తగ్గించుకునేందుకు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు సందర్భాన్ని బట్టి తమ రుణాలను విక్రయించి, తిరిగి బైబ్యాక్ చేయడం .. రుణగ్రహీత చెల్లించాల్సిన రీపేమెంట్లను అంతర్గతంగా ఖాతాల్లో సర్దుబాటు చేయడంలాంటివి వీటిలో ఉన్నట్లు దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment