సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు నాలుగు రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు నిరంతరం సేవలందిస్తున్నాయి. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారు. కరోనా బాధితుల చికిత్సకు సంబంధించి వైద్యులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆర్‌టీ పీసీఆర్ పాజిటివ్ (వైరాలజీ ల్యాబ్ పరీక్షలు)వస్తే ఎవరికి ఎక్కడ చికిత్స?
► 60 ఏళ్లు దాటిన వారు, వైరస్ లక్షణాలున్నా లేకపోయినా, దీర్ఘకాలిక జబ్బులు లేకపోయినా రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రికి తరలించాలి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువ మందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వారిని వెంటనే రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.
► పాజిటివ్ అయి ఉండి 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులై ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రికే పంపాలి.
► పాజిటివ్ వచ్చి కిడ్నీ, గుండె, మధుమేహం, హెచ్‌ఐవీ, శ్వాసకోశ, సీఓపీడీ, బ్రాంకైటీస్, టీబీ లాంటి వ్యాధులున్న వారిని వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.
► ఆర్‌టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వారిని, ఆక్సిజన్ అవసరం లేని వారిని లక్షణాలతో సంబంధం లేకుండా జిల్లా కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.
► వీరికీ ఈసీజీ, సీడీసీ, ఛాతీ ఎక్స్‌రే, సీరం క్రియాటిన్, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు చేస్తారు.
ఎవరికి ఎలాంటి వైద్యం?
► సాధారణ జ్వరం ఉన్న వారికి చికిత్స అవసరం లేదు
► మోడరేట్ అంటే 103 డిగ్రీల జ్వరం ఉండి కాలేయ పనితీరులో తేడా వచ్చినప్పుడు వారికి వైద్యం అవసరం. బాధితుడి పరిస్థితిని బట్టి వైద్యం అందించాలి.
► తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం అంటే శ్వాస ఆడకపోవడం, లివర్ ఎంజైములు ఎక్కువగా వచ్చినప్పుడు, బైల్‌రూబిన్ పెరగటం లాంటి లక్షణాలున్నప్పుడు ఐసీయూ లేదా వెంటిలేటర్‌పై చికిత్స అవసరం.
రిస్కు కేటగిరీ
నియంత్రణలో లేని మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెజబ్బు, ఊపిరితిత్తుల రుగ్మత, క్రానిక్ కిడ్నీ జబ్బులు, క్రానిక్ లివర్ వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి లోపించడం, హెచ్‌ఐవీ, పుట్టుకతో కొన్ని జబ్బులతో ఉన్నవారు, 60 ఏళ్లు దాటినవారు
డిశ్చార్జి ప్రొటొకాల్..
► కరోనా పాజిటివ్ రోగికి 14వ రోజు, 15వ రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు.
► గొంతులో ద్రవాన్ని పరీక్షిస్తారు. ఇందులో రెండు సార్లు నెగిటివ్ రావాలి. ఎక్స్‌రేలో స్పష్టత ఉండాలి.
► అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని భావిస్తే డిశ్చార్జి చేస్తారు.
► తిరిగి 29వ రోజు, 30వ రోజు రోగికి మరోసారి పరీక్షలు చేస్తారు. ఒకవేళ ఇందులో పాజిటివ్ వస్తే తిరిగి ఆస్పత్రికి రావాలి.
► రోగి డిశ్చార్జి అయ్యే సమయంలో ప్లాస్మాను సేకరించి భద్రపరుస్తారు.
► డిశ్చార్జి అనంతరం స్థానిక యంత్రాంగం బాధితుడిని పర్యవేక్షిస్తుంది.
► డిశ్చార్జి అయ్యాక 14 రోజులు విధిగా హోం ఐసొలేషన్‌లో ఉండాలి. పేషెంటు వినియోగించే టాయ్‌లెట్‌ను ఇతరులు వాడకపోవడం మంచిది.
► టాయ్‌లెట్‌కు వెళ్లి వచ్చిన వెంటనే హైపోక్లోరైడ్ ద్రావణంతో విధిగా శుభ్రం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment