ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం అందించే వైద్య సంబంధిత సేవలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) ఫండ్ నిధులను వినియోగించుకోవడానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు సీఎస్‌ఆర్‌లో భాగంగా వైద్య సేవల్లో పాలుపంచుకోవడానికి ఏపీ ఎకనావిుక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
ఆక్సిజన్ యూనిట్ల నిర్వహణ కూడా..
జిల్లాలవారీగా కోవిడ్ చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, పడకల సంఖ్య వంటి అన్ని వివరాలను ఏపీఈడీబీ సేకరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహణను కూడా ఆయా కంపెనీలకే అప్పగించనుంది. ఈ మేరకు ప్రస్తుత సంక్షోభంలో కంపెనీలు సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఈడీబీ.. ఇప్పటివరకు 500కు పైగా కంపెనీలకు లేఖలు రాయగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏషియన్ పెయింట్స్, కాల్గోట్ పామాయిల్, డీఆర్‌డీవో, జిందాల్ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), అర్జాస్ స్టీల్, ఆర్‌వీఆర్ ప్రాజెక్టŠస్ వంటి అనేక సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 200కు పైగా ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రానికి అందించగా, మరో 100 సిలిండర్లను త్వరలో అందించనున్నాయి. దీనిపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందిస్తూ.. కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని, ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు.
కార్పొరేట్ సాయం ఇలా...
జిందాల్ స్టీల్: ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా ఏప్రిల్ 24 నుంచి రోజూ 20 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ కొరత తీరే వరకు సరఫరా చేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది.
విశాఖ స్టీల్: విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. మే 15 నాటికి అదనంగా మరో 150, మే 30 నాటికి 250, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తెచ్చే విధంగా విశాఖ స్టీల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
డీఆర్‌డీవో: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 100 ఆక్సిజన్ సిలిండర్లను అందించడంతోపాటు అనంతపురం జిల్లాలో ఒక ఆక్సిజన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఏషియన్ పెయింట్స్: 50 ఆక్సిజన్ సిలిండర్లను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అందజేసింది.
ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్: 50 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది
ఓయో: కోవిడ్ నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ విశ్రాంతి కోసం ఉచితంగా తమ హోటల్ గదులను వినియోగించుకోవడానికి అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment