
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రజలందరూ సమష్టిగా సహకరించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సప్తగిరి చానల్‌లో శుక్రవారం గవర్నర్ ప్రసంగిస్తూ కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. ఈ సంక్షోభ సమయంలో కరోనాపై ఏమాత్రం నిర్లక్ష్య ధోరణి సరికాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలు తమను, తమ కుటుంబాలను కాపాడుకోవడంతో పాటు సమాజానికి అండగా నిలవాలన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం నిబంధనలను పాటించాలన్నారు.
అర్హులైన అందరూ కరోనా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. కరోనాపై పోరుకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం టీకాయేనని చెప్పారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా సరే ఐసొలేషన్‌లో ఉండటం, 104 కాల్ సెంటర్‌ను సంప్రదించి వైద్యుల సహకారం తీసుకోవాలన్నారు.