న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సిబ్బంది జవాబుదారీతనానికి సంబంధించి నిబంధనలు సూచించింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది.
కేవలం నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, దురుద్దేశంతో తీసుకున్న వాటికి వర్తించబోవని ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి కేసుల్లో విచారణ జరిపేందుకు పాటించాల్సిన విధానాలను వివరించింది. రుణాన్ని మొండిబాకీగా వర్గీకరించిన ఆరు నెలల్లోగా జవాబుదారీగా వ్యవహరించాల్సిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఓవైపు నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా ఈ మార్గదర్శకాలు ప్రోత్సహించగలవని ఆర్థిక శాఖ పేర్కొంది.
ఓ సంస్థ రుణ ఎగవేత కేసుకు సంబంధించి ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా పలువురు బ్యాంకర్లు రుణ డిఫాల్ట్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం గమనార్హం. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) విచారణలకు భయపడి, కొన్ని రకాల రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టి, రుణ వితరణను మెరుగుపర్చేలా బ్యాంకర్లను ప్రోత్సహించేందుకు తాజా మార్గదర్శకాలు ఉపయోగపడగలవని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment