సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ కీలకమైన సమయంలో నగరంలోని క్యాబ్ డ్రైవర్‌లు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఏ పార్టీకి ఓటు వేసినా లాభం లేదంటూ ‘నోటా’పాట అందుకున్నారు. ‘నోటా’పై నొక్కాలని ప్రజలను కోరుతున్నారు. వేలాది డ్రైవర్లు తమ వాహనాలపైన ఈ తరహా పోస్టర్లను అతికించుకొని తిరుగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ‘నోటా’ప్రచారం పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్ధులను హడలెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించాయని, ఏ మేనిఫెస్టోలోనూ తమ సమస్యలను ప్రస్తావించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థల మోసాల బారి నుంచి కాపాడాలంటూ రాజకీయ పార్టీలకు, నేతలకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్, భాగస్వాముల మధ్య పోటీని తీవ్రతరం చేసిన క్యాబ్ సంస్థలు తమను తీవ్రంగా దోచుకుంటున్నాయని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వలేదన్నారు. తమకు సహకారాన్ని అందించని రాజకీయ పార్టీలపైన నమ్మకాన్ని కోల్పోయి ‘నోటా’ప్రచారానికి దిగినట్లు సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ క్యాబ్, ట్యాక్సీ, ఆటో, తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో కొనసాగుతున్న లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment