ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకో ఆయన స్థాయికి తగినట్లు ఉండడం లేదు. తాజాగా ఇండియా టివీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమా? లేక అత్యాశకు ప్రతిబింబమా? అనే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 2047 వరకు ఆయన వికసిత్ భారత్ కోసం పాటుపడుతూ.. ఆ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు.
⇒ ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఆయన మాట్లాడినట్లు అనిపించదు. నియంతల రాజ్యంలోనో, చక్రవర్గుల పాలనలోనో, లేక మతపరమైన నమ్మకాలు అధికంగా ఉన్న దేశాలలోనో ఇలాంటి ప్రసంగాలు చేస్తే తప్పక జనం వినాల్సి ఉంటుంది. కానీ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో అలా సాధ్యపడకపోవచ్చు. ఆయన వందేళ్లు పైబడి జీవించవచ్చు. 2047 సంవత్సరం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే ఏడాది అన్నమాట. తప్పు లేదు. దేశం అభివృద్ది కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. కానీ తొంభై ఏళ్లు దాటిన తర్వాత కూడా అంత శక్తితో ఉంటారా? అనే సంశయం వస్తుంది.
⇒ భారతీయ జనతా పార్టీలో అనుసరిస్తున్న ఒక విధానం ప్రకారం డెబ్బై ఐదేళ్లు దాటితే క్రియాశీలక పదవులలో ఉండరాదని చెబుతారు. అందువల్లే ఎల్.కె. అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటివారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. కేవలం మర్యాదపూర్వక నేతలుగానే ఉన్నారు. ప్రస్తుతం మోదీ వయసు డెబ్బైనాలుగేళ్లు. ఈసారి గెలిస్తే టరమ్ పూర్తి అయ్యేసరికి ఆయన వయసు డెబ్బైతొమ్మిదేళ్లు అవుతుంది. ఒకపక్క ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డెబ్బైఏడు ఏళ్ల వయసు వచ్చిందని విమర్శలు చేస్తున్న బీజేపీ పెద్దలు అదే మోదీ విషయంలో భిన్నంగా ఎలా మాట్లాడతారో తెలియదు. ఆయన ఆశిస్తున్నట్లు 2047 వరకు పదవులలో ఉంటే అప్పటికీ తొంభై ఏడేళ్ల వయసు వస్తుందన్నమాట. అప్పటివరకు ఆయన అధికారంలో ఉండడం సాధ్యమా అంటే ఏమి చెబుదాం. అలా జరిగితే అద్బుతమే అని అనాలి.
⇒ కొంతమంది బాగా వయసు వచ్చేవరకు పదవులలో ఉన్న సందర్భాలు లేకపోలేదు. సీనియర్ నేత మొరార్జీ దేశాయ్ 81 ఏళ్ల వయసులో జనతా పార్టీ పక్షాన దేశ ప్రధాని అయ్యారు. మూడేళ్లపాటు ఆయన పదవి నిర్వహించిన తర్వాత రాజకీయాలకు దాదాపు దూరం అయ్యారని చెప్పాలి. ఎల్.కె. అద్వాని ప్రస్తుతం 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారు. కానీ ఆయన పదేళ్ల క్రితమే యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అయ్యారని చెప్పవచ్చు. అమెరికా దేశ అధ్యక్షుడు బిడైన్ ప్రస్తుత వయసు 82 ఏళ్లు. మరో సారి ఆయన పోటీలో ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత వయసు 78 ఏళ్లు. ఆయన కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ గెలిస్తే 82 ఏళ్ల వరకు అధికారంలో ఉండవచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి రెండు టరమ్‌లకే పరిమితం. మన దేశంలో అలాంటి నిబంధన ఏమీ లేదు. అందువల్ల ఒకసారి అత్యున్నత పదవిలోకి వచ్చినవారు దానిని వదలిపెట్టడానికి అంతగా ఇష్టపడరని జనం భావన.
⇒ ప్రధాని మోదీ కూడా అదే తరహాలో ఉన్నారా అనే భావన వస్తుంది. ఆయన 2047 వరకు ప్రధానిగా ఉంటానని నేరుగా చెప్పకపోయినా, వికసిత్ భారత్ లక్ష్యం కోసం తనను దేవుడు పంపించాడని ఆయన ఫీల్ అవుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే, నిజంగా ఆయన ఆ వయసు వరకు జీవించి ఉండి, దేశ ప్రధానిగా కొనసాగి, అభివృద్దికి దోహదపడితే అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మోదీ చేస్తున్న ప్రకటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనలో తడబాటుతోపాటు పొరబడుతున్నారా అనే డౌటు వస్తుంది.
⇒ ఉదాహరణకు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంపై బుల్ డోజర్ నడుపుతారని అనడం అత్యంత వివాదాస్పదం అయింది. మోదీ స్థాయికి అలా మాట్లాడకూడదని చెప్పాలి. అలాగే అవినీతి పరులను పార్టీలో చేర్చుకుంటూ, అవినీతిపరులని తానే ప్రకటించి మళ్లీ వారితో తానే పొత్తు పెట్టుకున్న తీరు గమనించిన తర్వాత మోదీ చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే ముస్లింలకు సంబంధించి ఆయన ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికలలలో ఆశించినన్ని సీట్లు రావని మోదీ భయపడుతున్నారని, అందుకే హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
⇒ మోదీ చెప్పినవాటిలో ఒక్కటి మాత్రం పూర్తి నిజం. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవని ఆయన చెప్పారు. భారత దేశంలో ప్రధానమంత్రి పదవిని మించి మరొకటి లేదన్నది తెలిసిందే. మోదీ చరిత్ర చూస్తే ఇది ఒకరకంగా అనూహ్యమైన రీతిలో అసాధారణమైన తీరుగా ఎదిగారని చెప్పవచ్చు. కేవలం ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ విధంగా ఎదుగుతారని అనుకోలేం. కానీ మోదీ చేసి చూపించారు. ఇంత ఘనత సాధించిన మోదీ అంటే గౌరవమే కానీ, ఈసారి ఆయన ప్రసంగాలలో అభ్యంతర విషయాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 400 సీట్లు వస్తాయని పదే, పదే చెబుతున్నా, అది ఎంతవరకు సాధ్యమన్నది సంశయంగా ఉంది.
⇒ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, బీహారు వంటి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు వస్తాయా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు జాతీయ స్థాయి సెఫాలిజిస్టులు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీకి కాస్త అటు, ఇటుగా సీట్లు సంపాదించవచ్చేమో కానీ, 400 సీట్లు వస్తాయని అంచనాలు వేయడం లేదు. నిజానికి మోదీకి కాంగ్రెస్ కూటమిలో సరైన ప్రత్యర్ధి లేకపోవడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. రాహుల్ గాంధీ ఉన్నంతలో పోటీ ఇస్తున్నా, ఆయనలో మెచ్యూరిటీపై అనుమానాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలలో కూడా వెనకబడి ఉంటున్నారు. కొన్నిసార్లు తెలివితక్కువగా కూడా ఉంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కాస్త సఖ్యత కోసం ప్రయత్నించవలసిన రాహుల్ పనికట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం విస్తుపరుస్తోంది.
⇒ తెలంగాణ రాజకీయాలలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఏపీకి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఇంకా కుట్రలు చేస్తున్నారన్న భావన కల్పించారు. అలాగే కర్నాటక, తెలంగాణలలో అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో కూడా పాత్ర పోషించారు. జాతీయ స్థాయి మానిపెస్టోలో ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం వంటి అంశాలవల్ల వారిపై నమ్మకం కుదరడం లేదు. ఇవన్ని మోదీకి కలిసివచ్చే పాయింట్లుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వాటిని అందిపుచ్చుకోలేకపోతోందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీని ప్రయోగించి జైలుకు పంపించిన వైనం ప్రజలలో విమర్శలకు దారి తీసిందని చెప్పాలి.
⇒ యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ 34 లక్షల రూపాయలు పట్టుకుందని, అవి పిల్లాడి స్కూల్ బ్యాగులోకి కూడా రావని అన్నారు. అదే, తన పదేళ్ల పాలనలో ఈడీ 2200 కోట్ల రూపాయలు పట్టుకుందని, వాటిని తరలించడానికి 70 టెంపోలు కావాలని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో లక్షల కోట్ల భారత సొమ్ము స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఉన్నాయని, దానిని తెస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వవచ్చని మోదీ అన్నారు. ఆ సంగతి పక్కనబెట్టి మోదీ కొత్తరాగం అందుకున్నట్లుగా ఉంది. పైగా బ్యాంకులలో వేల కోట్లు ఎగవేసినవారికి పార్టీ టిక్కెట్లు ఇస్తూ, తాను అవినీతి పార్టీ అని చెప్పిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వంటివి చూస్తే మోదీ మాటలకు అర్థాలు వేరులే అనే అభిప్రాయం కలుగుతుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment