
నిరంతరం ప్రజలతోనే.. మోడీ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ‘‘సభలు, సమావేశాలతో సరిపెట్టుకోవద్దు. జనచైతన్యానికి అవి మార్గాలే అయినా నిరంతరం ప్రజలతో ఉంటేనే సత్ఫలితాలు లభిస్తాయి’’ అని బీజేపీ ఎన్నికల ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. నవభారత యువభేరి సదస్సు అనంతరం ఆదివారంరాత్రి ఇక్కడి ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 20 నిమిషాలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితోపాటు కీలక నేతలందరూ పాల్గొన్నారు.
మోడీ మాట్లాడుతూ.. నాయకులు పార్టీ కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తామంటే ఫలితం ఉండదని స్పష్టంచేశారు. విజయరహస్యమంతా పార్టీ బూత్ కమిటీల ఏర్పాటుపైనే ఆధారపడి ఉంటుందని చెబుతూ.. వాటి పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గుజరాత్‌లోనైనా, మధ్యప్రదేశ్‌లోనైనా పార్టీ వరుస విజయాలు సాధించడానికి బూత్ కమిటీలను బలోపేతం చేయడమే ప్రధాన కారణమని తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామా.. ఓడతామా అన్నది అప్రస్తుతమని, ప్రతిచోటా పార్టీ బూత్ కమిటీ విధిగా ఉండాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ.. రాబోయే మూడు నెలల కాలం కష్టపడాలని ఆయన పార్టీ నేతలకు సలహా ఇచ్చారు. నవభారత యువభేరి సదస్సు జరిగిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అభినందించారు. యువభేరీకి వచ్చిన వారిని ఓట్ల రూపంలోకి మల్చుకోవాలని సూచించారు. ఈ ఉత్సాహంతో రాష్ట్ర నాయకులు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ అభిప్రాయాలను ప్రజల్లో మరింతగా ప్రచారం చేసుకోవడానికి వీలుగా సోషల్ నెట్‌వర్క్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా పార్టీ అభిప్రాయాలను కచ్చితంగా, సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చన్నారు. సదస్సుకు హాజరైన మోడీకి ఈ సందర్భంగా పార్టీ పదాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.