
సీమాంధ్ర ఉద్యమానికి సీఎం క్యాంపు కార్యాలయమే వేదిక
సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమే వేదికగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారాణి అధ్యక్షతన జరిగిన డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, నమ్మించి వంచించటం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. సీమాంధ్రలో జరిగే ఉద్యమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అండదండలున్నాయని, సాక్షాత్తూ సీఎం కిరణే తన కార్యాలయం నుంచి ఆ ఉద్యమాన్ని ఉసిగొల్పటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధిష్టానం తెలంగాణ ప్రకటన చేస్తే అందుకు భిన్నంగా కిరణ్ సీమాంధ్ర ఉద్యమానికి నేతృత్వం వహించటంలో అంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
యాభై రోజులు గడుస్తున్నా ఇచ్చిన ప్రకటనకు రూపులేదని, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలీ, అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లతో మాట్లాడించి ప్రజలను అయోమయానికి గురిచేస్తూ రెండు ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెస్ కారణమైందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ గ్రేటర్ కార్యదర్శి కన్నె రమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు బండారి సంతోశ్ కుమార్, కె.నర్సింగ్ యాదవ్, సల్లా నరేందర్, సుభాశ్ పటేల్, బి.భీమ్‌రాజ్, సూలం రవియాదవ్, ఓంప్రకాశ్, మల్లికార్జున్, ప్రతిభ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.