
బోనాల వేడుకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక
సాక్షి, న్యూఢిల్లీ: బోనాలను కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బంగారం బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. బోనాల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.