ఢిల్లీలో తెలంగాణ బోనాల ఉత్సవాలు | Bonalu at Telangana Bhavan in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో తెలంగాణ బోనాల ఉత్సవాలు

Published Thu, Jul 7 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

Bonalu at Telangana Bhavan in Delhi

చాంద్రాయణగుట్ట : ఈ నెల 9,10వ తేదీలలో లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా బోనాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు గురువారం నగరం నుంచి బయల్దేరారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తలపై అమ్మవారి బంగారు బోనం ఎత్తుకొని కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి బ్యాండ్ మేళాల నడుమ అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొని బయల్దేరారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ....గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ తరఫున ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఆలయ కమిటీ సభ్యులతోపాటు 100 మంది భక్తులతో కలిసి ఈ బోనాలను జరుపనున్నామన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు సాంస్కతిక శాఖ కార్యదర్శి సహకరించి 50 మంది కళాకారులను కూడా కేటాయిస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు.

ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలలో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం ఎత్తుకోనున్నారన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ కూడా హాజరు కానున్నారన్నారు. ఉత్సవాల కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించనున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారులు జి.మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వై.కైలాష్ వీర్, కోశాధికారులు జి.అరవింద్ కుమార్ గౌడ్, యు.సదానంద్ గౌడ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్రచార కార్యదర్శి మహేష్, సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బల్వంత్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, విష్ణు గౌడ్, కె.వెంకటేష్, కాశినాథ్ గౌడ్‌తో పాటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement