ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధానిలో నూతన తెలంగాణ భవన్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో జరిపిన సమీక్ష సందర్భంగా కొత్త భవన్ నిర్మాణం చేపట్టేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పార్టీ పెద్దలను కలిసేందుకు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఉమ్మడి ఆస్తుల విభజన అంశాలపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం, అందులో ఉన్న భవనాలు, వాటి ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ వాటా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీలో ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు వివరించారు. ఇందులో పునర్విభజన చట్టం ప్రకారం 42ః58 నిష్పత్తిలో తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు వస్తుందని చెప్పారు.
ప్రస్తుత భవనాలు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుత భవనాలన్నీ మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవని, చాలావరకు శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేయిస్తున్నామని గౌరవ్ ఉప్పల్ వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని చెప్పారు. ఇదే సమయంలో ఆస్తుల విభజన ప్రక్రియను వేగిరం చేసే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
పదవుల భర్తీపై కేసీతో భేటీ
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, రాజకీయ వ్యవహారాల కమిటీలో చేసిన తీర్మానాలు, ఆరు గ్యారంటీల అమలు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, మద్దతుగా నిలిచిన జేఏసీ, కుల సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేసీ సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవుల భర్తీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంకతో చర్చించిన అనంతరమే ఓ నిర్ణయానికి రావాలని తీర్మానించినట్లు సమాచారం.
రాజకీయ ప్రముఖులకు రేవంత్ విందు
ఢిల్లీలోని రాజకీయ ప్రముఖులు, గతంలో తనతో కలిసి పనిచేసిన ఎంపీలకు రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. తుగ్లక్‌రోడ్డులోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఎంపీలు శశిథరూర్, మాణిక్యం ఠాగూర్, సుదీప్ బందోపోధ్యాయ, దీపేందర్ హుడా, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, మాగుంట శ్రీనివాసరెడ్డి, డీకే సురేశ్, రఘురామ కృష్ణరాజు, సీఎం రమేశ్, నిరంజన్‌రెడ్డితోపాటు మరికొందరు హాజరైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment