దేశ సంపద సృష్టిలో ప్రధానపాత్ర పోషిస్తున్న బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీల తరహాలోనే సబ్ ప్లాన్ (ఉప ప్రణాళిక) ఉండాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు గడుస్తున్నా బీసీల ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం మారకపోవడమే ఈ సబ్ ప్లాన్ డిమాండ్‌కు కారణమని పేర్కొంది.
బీసీ సబ్ ప్లాన్ సాధనకై ఈ నెల 26 నుంచి తలపెట్టిన 48 గంటల మహాదీక్ష సన్నాహక సదస్సు గురువారమిక్కడ కె. లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, అరుణజ్యోతి, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై అనంతరామం కమిటీ నుంచి సుబ్రమణ్యం కమిషన్ వరకు అనేక సిఫార్సులు చేసినా బుట్టదాఖలయ్యాయని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో 40 శాతం నిధుల్ని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బీసీ జాబితాలోని 139 కులాల్లో కొద్దిమందికి మాత్రమే నిర్దిష్టమైన వృత్తులు, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, కులవృత్తుల్ని కాపాడేందుకు కూడా ఈ సబ్ ప్లాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులవృత్తుల్లోకి బడా వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల ప్రమేయాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉపప్రణాళిక సహా ఏడు డిమాండ్లతో ఇందిరాపార్క్ వేదిక జరిగే మహా దీక్షకు పెద్దఎత్తున జనాన్ని సమీకరించాలని సమావేశం నిర్ణయించింది.
బీసీలకు సబ్ ప్లాన్ ఉండాల్సిందే: బీజేపీ
Published Thu, Aug 22 2013 10:02 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
Advertisement