BC sub-plan
-
అన్నీ జగన్ చెప్పినవే..
-
జగన్ హామీలను వరుసగా కాపీ కొడుతున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇదివరకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్నికల వేళ వరుసగా కాపీ కొడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ఆయా కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేరుస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఆ మాట నిలుపుకోలేదు. కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా ప్రస్తుతం ఉన్న 11 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ చాలా సభల్లో పలు మార్లు చెప్పారు. పైగా ఆయా కులాలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, శ్రీసైన, యాదవ, కురుబ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ, తూర్పుకాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, గాండ్ల, చేనేత, తదితర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వర్గాల వారు సమస్యలు వివరిస్తూ పాదయాత్రలో వైఎస్ జగన్‌కు వినతి పత్రాలు సమర్పించడంతో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కార్పొరేషన్ల ఏర్పాటుకు హామీ ఇవ్వడం తెలిసిందే. బీసీ సబ్ ప్లాన్ పేరుతో మళ్లీ మోసం చేసే ప్రకటన నాలుగేళ్లుగా ఏటా రూ.10 వేల కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద బడ్జెట్లో కేటాయించామని చంద్రబాబు బీసీలను మోసం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ఇంత వరకు విధి విధానాలు లేకుండా బడ్జెట్లో నిధులు ఎలా కేటాయించారనే దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పడం లేదు. కేవలం బీసీ జనాభా ఉన్న ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం చేసిన ఖర్చును బీసీ సబ్‌ప్లాన్ కింద ఖర్చు చేసినట్లు చూపించి మోసం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్ విధి విధానాల రూప కల్పనకు కమిటీ వేస్తామని తాజాగా సదస్సులో ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ అంటూ మోసం చేసిన విషయాన్ని ఆయన అంగీకరించినట్లేనని పలువురు బీసీ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన కులాలకు కార్పొరేషన్ తానే ఏర్పాటు చేసినట్లు సభలో గొప్పలు చెప్పుకున్నారు. నిజానికి దివంగత సీఎం వైఎస్సార్ నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో విధి విధానాలకు రూపకల్పన జరిగింది. అప్పట్లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌కుమార్ ఈ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్ ఏర్పాటైంది. అన్నీ జగన్ చెప్పినవే.. పెన్షన్లు రెట్టింపు చేశానని, ట్రాక్టర్లు, ఆటోలకు ట్యాక్స్ ఎత్తి వేశానని, నాయీ బ్రాహ్మణులకు తాను తప్ప ఎవ్వరూ సాయం చేయలేదని చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. బీసీలకు ఆదరణ గురించి చెబుతూ 4 లక్షల మందికి వస్తువులు అందించినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆదరణ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న వారు 7.53 లక్షల మంది ఉంటే అందులో డిపాజిట్ కట్టిన వారు 3.44 లక్షల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో కనీసం రెండు లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో వస్తువులు ఇవ్వలేదు. పైగా ఇచ్చిన వస్తువులన్నీ నాసిరకం. అయినా చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం చూసి సభకు వచ్చిన పలువురు ఆశ్చర్యపోయారు. సభ జరుగుతున్న సమయంలో పలుమార్లు ‘తమ్ముళ్లూ చప్పట్లు కొట్టండి’ అంటూ కోరినా పెద్దగా స్పందన రాలేదు. నాయీ బ్రాహ్మణులు ఇటీవల సచివాలయం వద్దకు వచ్చి సమస్యలు విన్నవిస్తే చంద్రబాబు తీవ్రంగా మండిపడిన విషయం ఎవరూ మరచి పోలేదు. ‘నన్నే ప్రశ్నిస్తారా.. మీ తోకలు కట్ చేస్తా’నని బెదిరించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రకటించినవన్నీ ఇదివరకే జగన్ ఇచ్చిన హామీలే. ఆటో వాలాలు జగన్‌ను కలిసి సమస్యలు వివరించినప్పుడు ట్యాక్స్ తీసి వేయడంతో పాటు సంవత్సరానికి రూ.10 వేలు ఉచితంగా సాయం అందిస్తానని ప్రకటించారు. అవ్వాతాతలకు తోడుగా ఉంటానని చెబుతూ పెన్షన్‌ను రూ. రెండు వేలు చేస్తానని, రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు అనేకసార్లు చెప్పారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తానని, డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే ఇస్తానని కూడా జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి
కాంగ్రెస్ నాయకులకు మంత్రి తలసాని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంటే కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించారు. నోరుంది కదాని మాట్లాడితే ఊరుకోబోమని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దమ్ముంటే ప్రజల వద్దకు వెళ్లాలని సవాల్ విసిరారు. కొత్త జిల్లాలు ఇష్టారాజ్యంగా చేశారంటూ ఆరోపించే కాంగ్రెస్ నేతలు అఖిలపక్ష సమావేశంలో ఎందుకు నోరు మెదపలేదని విమర్శించారు. ప్రజాభిప్రాయాలు తీసుకునే కేబినెట్ ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే దానిపై కనీసం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పలేదని, వారిలో వారు కొట్టుకోవడంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, కాంగ్రెస్‌ను ఆ దేవుడే కాపాడాలన్నారు. మైనారిటీలకు కొత్తగా మరో 70 పాఠశాలలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్షాల వల్ల కొంతమేర పంట నష్టపోయినా తాము వెంటనే కలెక్టర్లను అప్రమత్తం చేసి నష్టాన్ని అంచనా వేశామని, కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి తెలిపామని వివరించారు. -
’బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలి’
హైదరాబాద్ : సమాజంలో 52 శాతం ఉన్న బీసీల అభివృద్దికి బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ది చెందుతారని, దీని కోసం గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 92శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్దియే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు విజిఆర్ నారగోని మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ది పట్ల ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు. రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాలని అన్నారు. 52శాతం ఉన్న బిసిలను మనం ఓటు బ్యాంక్‌గా ఎందుకు మార్చుకోకుడదని. పోరాటం మనం చేస్తే ఓట్లు వారికి వేస్తున్నారన్నారు. -
బీసీ సబ్‌ప్లాన్ అమలుపై మాటమార్చిన ఏపీ సర్కార్
హైదరాబాద్: బీసీ సబ్‌ప్లాన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట మార్చింది. రూ.6,640 కోట్లతో ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని నిన్నటివరకూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త పల్లవి ఎత్తుకుంది. బీసీ సబ్‌ప్లాన్‌ను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రకటించారు. కాగా ఏపీలో బార్ లైసెన్స్‌లు నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు రైతులకు ప్యాకేజీ అర్థం కాగా ఆందోళన చెందారని, పోర్టుకు 5,300 ఎకరాలు అవసరమని, అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాలకు సేకరిస్తామన్నారు. మొదట భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పుడు భూ సమీకరణ చేయాలనుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పెద్ద రైతులు రెచ్చగొట్టడం వల్లే ఆందోళన చేస్తున్నారని, త్వరలో రైతుల అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు...దరఖాస్తు చేసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ ఏడాది 1600 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. -
రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ రుణాలపై సబ్సిడీని రూ.30 వేల నుంచి లక్షకు పెంచాలన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 22 బీసీ సంఘా ల భేటీలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సు ల పూర్తి ఫీజుల్ని సర్కారే భరించి రూ.35 వేల పరిమితిని ఎత్తివేయాలన్నారు. వీరశైవ లింగాయత్ నూతన కార్యవర్గం: ఇదే సమావేశంలో వీరశైవ లింగాయత్ కొత్త కార్యవర్గాన్ని కృష్ణయ్య ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా పట్లోల్ల సంగమేశ్వర్, అధ్యక్షుడిగా బెడఖాని హన్మంతు, సెక్రటరీ జనరల్‌గా వెన్న ఈశ్వరప్ప, ఉపాధ్యక్షుడిగా ఎం.వీరయ్య, కార్యదర్శిగా చంద్రకాంత్ పాటిల్, కోశాధికారిగా ఎ.చంద్రశేఖర్‌ను నియమించారు. ఆర్ఎంపీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి: రాష్ట్రంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి వారికి మెడికల్ డిప్లొమా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ జరిగిన తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ‘శంఖారావం’ రాష్ట్ర సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టుకోవడానికి ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం 50% సబ్సిడీపై 2 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలందించాలని కోరారు. -
అంత ధీమా ఉంటే.. ప్రజా తీర్పు కోరండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో మూడోసారి కూడా నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అంత ధీమా ఉంటే.. ప్రజల తీర్పు కోరాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు సవాల్ చేశారు. ‘‘అసమర్ధత, అవినీతి, అక్రమాలలో ఆరితేరినందుకు జనం మళ్లీ పట్టంకడతారా?’’ అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు వై.రఘునాథ్‌బాబు, ఎన్.రామచంద్రరావు, శ్రీధర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన ఘనత యూపీఏకే దక్కిందని ధ్వజమెత్తారు. ధరలు ఆకాశాన్నంటాయని, ఆర్ధిక లోటు ఆందోళనకర స్థాయికి చేరిందని, పారిశ్రామిక ఉత్పత్తి తిరోగమన దిశలో ఉందని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని.. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చరిత్రలోనే చూడలేదని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలిపెట్టి.. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీని అపఖ్యాతి పాల్జేయటమెలా, లౌకికవాదం ముసుగులో ఓట్లు దండుకోవటమెలా అనే రెండు సూత్రాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఇచ్చామని చెబుతున్న హక్కులన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నవేనన్నారు. అనంతపురంలో పదెకరాలు, మహబూబ్‌నగర్‌లో 15 ఎకరాలున్న రైతులకన్నా.. హైదరాబాద్‌లోని కిళ్లీ బడ్డీ యజమానే నయమన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణపై మాట్లాడిన అంశాలపై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, సిద్ధాంతపరమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘టీడీపీతో పొత్తు ఉంటుందా?’ అని ప్రశ్నించగా.. పొత్తులపై చర్చించలేదని.. ఏవైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు లేవని బదులిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 272కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. బీసీ సబ్‌ప్లాన్‌పై నేటి నుంచి బీజేపీ దీక్ష బీసీ సబ్‌ప్లాన్ కోసం సోమ, మంగళవారాల్లో బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు దీక్షలో పాల్గొంటారు. -
బీసీలకు సబ్ ప్లాన్ ఉండాల్సిందే: బీజేపీ
దేశ సంపద సృష్టిలో ప్రధానపాత్ర పోషిస్తున్న బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీల తరహాలోనే సబ్ ప్లాన్ (ఉప ప్రణాళిక) ఉండాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు గడుస్తున్నా బీసీల ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం మారకపోవడమే ఈ సబ్ ప్లాన్ డిమాండ్‌కు కారణమని పేర్కొంది. బీసీ సబ్ ప్లాన్ సాధనకై ఈ నెల 26 నుంచి తలపెట్టిన 48 గంటల మహాదీక్ష సన్నాహక సదస్సు గురువారమిక్కడ కె. లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, అరుణజ్యోతి, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై అనంతరామం కమిటీ నుంచి సుబ్రమణ్యం కమిషన్ వరకు అనేక సిఫార్సులు చేసినా బుట్టదాఖలయ్యాయని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధుల్ని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ జాబితాలోని 139 కులాల్లో కొద్దిమందికి మాత్రమే నిర్దిష్టమైన వృత్తులు, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, కులవృత్తుల్ని కాపాడేందుకు కూడా ఈ సబ్ ప్లాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులవృత్తుల్లోకి బడా వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల ప్రమేయాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉపప్రణాళిక సహా ఏడు డిమాండ్లతో ఇందిరాపార్క్ వేదిక జరిగే మహా దీక్షకు పెద్దఎత్తున జనాన్ని సమీకరించాలని సమావేశం నిర్ణయించింది.