ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి
కాంగ్రెస్ నాయకులకు మంత్రి తలసాని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంటే కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించారు. నోరుంది కదాని మాట్లాడితే ఊరుకోబోమని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దమ్ముంటే ప్రజల వద్దకు వెళ్లాలని సవాల్ విసిరారు. కొత్త జిల్లాలు ఇష్టారాజ్యంగా చేశారంటూ ఆరోపించే కాంగ్రెస్ నేతలు అఖిలపక్ష సమావేశంలో ఎందుకు నోరు మెదపలేదని విమర్శించారు.
ప్రజాభిప్రాయాలు తీసుకునే కేబినెట్ ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే దానిపై కనీసం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పలేదని, వారిలో వారు కొట్టుకోవడంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, కాంగ్రెస్‌ను ఆ దేవుడే కాపాడాలన్నారు. మైనారిటీలకు కొత్తగా మరో 70 పాఠశాలలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్షాల వల్ల కొంతమేర పంట నష్టపోయినా తాము వెంటనే కలెక్టర్లను అప్రమత్తం చేసి నష్టాన్ని అంచనా వేశామని, కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి తెలిపామని వివరించారు.