బీసీ సబ్ప్లాన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట మార్చింది.
హైదరాబాద్: బీసీ సబ్ప్లాన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట మార్చింది. రూ.6,640 కోట్లతో ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని నిన్నటివరకూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త పల్లవి ఎత్తుకుంది. బీసీ సబ్ప్లాన్ను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రకటించారు. కాగా ఏపీలో బార్ లైసెన్స్లు నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు రైతులకు ప్యాకేజీ అర్థం కాగా ఆందోళన చెందారని, పోర్టుకు 5,300 ఎకరాలు అవసరమని, అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాలకు సేకరిస్తామన్నారు.
మొదట భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పుడు భూ సమీకరణ చేయాలనుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పెద్ద రైతులు రెచ్చగొట్టడం వల్లే ఆందోళన చేస్తున్నారని, త్వరలో రైతుల అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఇక హైదరాబాద్లో ఉన్న ఏపీ విద్యార్థులు...దరఖాస్తు చేసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ ఏడాది 1600 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు.