బీసీ మహిళా అధికారి తోలు తీస్తా అనడం నీ అహంకారానికి నిదర్శనం
మామతో కలిసి ఐదేళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు
ఎన్నికల్లో మాదే విజయం.. పేదలకు మంచి చేసేదీ మేమే
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, మచిలీపట్నం: ‘ప్రభుత్వ ఆదేశాలతో పని చేసే రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తా అనడం కొల్లు అహంకారానికి నిదర్శనం’ అని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో అధికారులు రాత్రి వేళల్లో పనిచేయలేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పేదలకు మంచి చేసేదీ తామే అని అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని తనపై కొల్లు చేసిన ఆరోపణలకు పేర్ని నాని ఘాటుగా జవాబు ఇచ్చారు.
కొల్లు హయాంలో పేదలతో పాటు విలేకరులకు ఇచ్చిన దొంగ పట్టాలు, ఆర్‌ఎస్సార్ రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను మీడియా ముందు ఆధారాలతో చూపారు. రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు. కొల్లు మంత్రిగా ఉండి మామతో కలిసి ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాడని విమర్శించారు. తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తామన్నారు. తాను ప్రజలకు ఏ రోజూ దొంగ పట్టాలు ఇవ్వలేదన్నారు.
పదవి పోయే పది రోజుల ముందు విలేకర్లకు ఎలాంటి వార్డు నంబర్లు లేకుండా కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చారని, ఆ రోజు అందుకు ప్రభుత్వ అనుమతి, జీవో ఉందా అని ప్రశ్నించారు. విలేకరులకే దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసిన కొల్లు శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటన్నారు. 1977–78 తుపాన్‌లో నష్టపోయిన గిరిపురం మత్స్యకారులకు ఒక్కరికైనా టీడీపీ నేతలు ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, వారికి అండగా నిలిచి, రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించింది తానే అని చెప్పారు.
విజయవాడలో నివసిస్తూ ఎన్నికల వేళ ఓట్లు కోసం బందరుకు వచ్చే కొల్లుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తన కుమారుడు పేర్ని కిట్టు బోగస్ శంకుస్థాపనలు చేస్తున్నారని అరోపించారని, అవి 70 శాతం పూర్తయిన పనులని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిట్టు ఎమ్మెల్యే అవటం ఖాయమని.. ప్రజలకు అతడే పట్టాలిస్తాడని అన్నారు. ఈ సమావేశంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు భారతి, విజయలక్ష్మీ, మాజీ జెడ్‌పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment