సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల కంటే తగ్గని విధంగా కొత్త మద్యం విధానం.. అక్టోబర్ 1 నుంచి అమలు
ఈ నెలాఖరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం
ఉద్యోగుల కాంట్రాక్టు కూడా ముగింపు
జిల్లా కమిటీల ద్వారా ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు
సామాన్యులకు అందుబాటు ధరలో ఒక ప్రత్యేక బ్రాండ్
నేడు కేబినెట్ భేటీలో నూతన విధానానికి ఆమోదం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది.
కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు.
కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు.
నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు
ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment