ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి
కొల్లు రవీంద్ర, పార్థసారథికి అవకాశం
ఎన్టీఆర్ జిల్లా కు ప్రాతినిధ్యం కరువు
పలువురు ఆశావహులకు దక్కని చోటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజకీయంగా ప్రాధాన్యమున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంత్రివర్గంలో రెండు పదవులు మాత్రమే దక్కాయి. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాణస్వీకా రంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. నూతనంగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లా నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. టీడీపీలోని సీనియర్లు, సామాజికవర్గాల పరంగా తమకు మంత్రిపదవి ఖాయమనుకున్న వారికి నిరాశ తప్పలేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన కేపీ సారథికి క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. బీజేపీ నుంచి గెలుపొందిన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రులే. ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో అమాత్యులుగా విధులు నిర్వర్తించిన వారే. ఉమ్మడి కృష్ణాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అభిప్రాయాలు ఆయా పారీ్టల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కొల్లు రవీంద్ర ప్రస్థానం ఇదీ..
కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర స్వగ్రామం బందరు మండలంలోని గరాలదిబ్బ. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసుడిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కనీ్వనర్‌గా, బీసీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రవీంద్ర 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
కొలుసు పార్థసారథి ప్రస్థానం ఇలా..
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి చేరిన నూజివీడు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి కొలుసు పెద్ద రెడ్డయ్య మచిలీపట్నం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి 2004లో అప్పటి ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎన్నికయ్యారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి, పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
సీనియర్లకు నిరాశ
ఎనీ్టఆర్ జిల్లాలో పలువురు ఆశావహులకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నిౖకైన గద్దె రామ్మోహనరావు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కుతుందని ఆశించారు. విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమామహేశ్వరరావు కూడా తనకు చోటు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరాం తాతయ్యకు ఈ సారీ నిరాశే మిగిలింది. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కకుండా టీడీపీ సామాజికవర్గం వారే అడ్డుకొన్నారనే భావన నియోజకవర్గంలో వ్యక్తమైంది.
ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడీ టీడీపీలో చేరి మైలవరం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌కు లోకేష్ ఆశీస్సులతో మంత్రివర్గం చోటు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి, జనసేన తరఫున అవనిగడ్డ నుంచి గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో చోటు ఖాయ మనే అనే ప్రచారం జరిగింది. ఎస్సీ మహిళ కోటాలో మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశించారు. గన్నవరం, గుడివాడ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, వెనిగండ్ల రాముకు కూడా అవకాశం లభించొచ్చని పార్టీ నాయకులు భావించారు.
Comments
Please login to add a commentAdd a comment