
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌సరళి తమకు కలసివస్తుందని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సికింద్రాబాద్ స్థానాన్ని కచ్చితంగా గెలవడంతోపాటు అదనంగా ఒకట్రెండు స్థానాలు బోనస్‌గా లభిస్తాయని అంచనా వేస్తున్నారు. నరేంద్రమోదీ చరిష్మాతోపాటు పోటీ చేసిన అభ్యర్థుల పలుకుబడి, జాతీయపార్టీగా సానుకూలత వెరసి మంచి ఫలితాలు వస్తాయని, గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లశాతం కూడా పెరుగుతుందని కమలంపార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో కూడా గట్టిపోటీ ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐదింట ప్రభావం..!
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను ఐదుచోట్ల పార్టీ పక్షాన గట్టిపోటీ ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్నామని, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిష్మాకు తోడు పార్టీకి ఉన్న బలం, నమో మంత్రం కలిసి వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్‌లో కూడా గణనీయంగా ఓట్లు తెచ్చుకుంటామని చెబుతున్న బీజేపీ నేతలకు నిజామాబాద్‌లో క్రాస్‌ఓటింగ్ ఆశలు రేకెత్తిస్తోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు తమకే క్రాస్ అయ్యాయని బహిరంగంగానే చెబుతున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్‌లో ఓటర్లు అధికసంఖ్యలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు పార్టీ నేతలు అంచనాకు వచ్చారు. సికింద్రాబాద్ బరిలో నిలిచిన కిషన్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఈసారి సానుభూతి ఓట్లు తమకు అనుకూలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పట్టణ ఓటర్లు ఎక్కువశాతం బీజేపీకే ఓట్లు వేశారన్న ధీమాతో పార్టీ ఉంది. మహబూబ్‌నగర్‌లోనూ మాజీమంత్రి డీకే అరుణకు ఉన్న పార్టీ కేడర్‌తో, కాంగ్రెస్ నుంచి కూడా ఓట్లు భారీగా వేశారని భావిస్తున్నారు. కరీంనగర్‌లోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి మొదటి నుంచి ఉన్న ఓటు బ్యాంకుతోపాటు టీఆర్‌ఎస్‌పట్ల ఉన్న వ్యతిరేకత బాగా కలిసి వచ్చిందని, భారీగా ఓట్లు వస్తాయని పార్టీవర్గాల పేర్కొంటున్నాయి.
బలీయశక్తిగా ఎదుగుతామా?
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి బీజేపీ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తమ ఓటుబ్యాంకు రెట్టింపు అవుతుందని, భవిష్యత్తులో పోటీ తమకు, టీఆర్‌ఎస్‌కేనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి మంచి నాయకత్వం వస్తుందని, కొత్తగా బలమైన నేతలు తెరపైకి వస్తారని, మళ్లీ ఎలాగూ మోదీ ప్రధాని అవుతారు కనుక పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం గమనార్హం. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment