కాంగ్రెస్, టీడీపీలది ద్వంద్వవైఖరి: కిషన్రెడ్డి
ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్ధత వల్లే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. తన మంత్రులను ఒక తాటిపై నిలపడంలో ప్రధాని విఫలమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే ఇరుప్రాంతాల్లో ఆందోళన చేయిస్తుందన్న అనుమానాన్ని కిషన్రెడ్డి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ ప్రమాణాల వల్లే రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు సమయంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉద్యమకారుల ముసుగులో తమ పార్టీపై మజ్లీస్ దాడులకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు.
దేశంలో సుస్థిరపాలన అందించే సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని, ఆయనకు భయపడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అంతకుముందు ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి సోనియా గాంధీ పావులు కదుపుతున్నారని, దీనికి టీడీపీ, టీఆర్‌ఎస్‌లు పునాదులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.