తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్‌రెడ్డి సీనియర్ లీడర్. ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. కానీ, ఎన్నికల దృష్ట్యా ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా బీజేపీ అధిష్టానం భావించింది. బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ అండ్ కోను దూకుడు స్వభావంతో ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న బండి సంజయ్‌ను తప్పించి.. సౌమ్యుడైన కిషన్‌రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ ఈజ్ ద రైట్ ఛాయిస్ అని కాషాయం పార్టీ ఒక అంచనాకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తే..
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ ఓ గందరగోళంలోకి కూరుకుపోయిందనే భావన బీజేపీ హైకమాండ్‌లో నెలకొంది. అదే టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో అప్రమత్తమైంది. వీటికి తోడు బండి చుట్టూరా నెలకొన్న వివాదాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడం, కీలక నేతల నుంచి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ తరుణంలోనే బండిని సైడ్ చేస్తూనే.. నేతల మధ్య ఎలాంటి అంసతృప్తి లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వివాదరహితుడైన కిషన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది.
► ఆరంభం నుంచి బీజేపీతోనే కిషన్‌రెడ్డి ప్రయాణం కొనసాగుతోంది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తిస్తూ క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఈ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి కిషన్‌రెడ్డి. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘంగా పార్టీతో అనుబంధం తర్వాత ఈ హోదా దక్కింది. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నారాయన.
► వీటన్నింటికి తోడు.. ఆరేళ్లపాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగించినా అనుభవమూ ఉంది. ఆ సమయంలో ఆయన వివాదాల్లేకుండా పార్టీని ముందుకు నడిపించారు. అన్నింటికంటే ముఖ్యమైంది.. ప్రత్యర్థులపై సహేతుకమైన విమర్శలు గుప్పించడంలో కిషన్‌రెడ్డి దూకుడునే ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కేసీఆర్‌కు పదునైన చురకలనే అంటిస్తారాయన. అందుకే.. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా బీజేపీ భావిస్తోంది. ఆయన నాయకత్వంపైనే పూర్తి భరోసా పెట్టుకుంది కూడా.
జోడు పదువులు?
గతానికి భిన్నంగా ఒకరికి ఒకే పదవి అనే అంశంపై బీజేపీ అధినాయకత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి చోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్రమంత్రి పదవితో పాటు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అలా.. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
మోదీతోనూ ప్రత్యేక అనుబంధం..
ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమైందన్న చర్చ గతంలో జోరుగా నడిచింది కూడా.
కిషన్‌రెడ్డి కంప్లీట్ ప్రొఫైల్
జననం : జూన్ 15, 1964
తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ
భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్
రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక
1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు
1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్
1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు
1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి
1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు
1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి
2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు
2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి
2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక
2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే
2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓటమి
2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం.. కేంద్ర మంత్రి పదవి
2023, జులై 5: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
ఇదీ చదవండి: బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు?
Comments
Please login to add a commentAdd a comment