ఉగ్రవాదుల డేటాబ్యాంక్‌! | Terrorist Data Bank | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల డేటాబ్యాంక్‌!

Published Sun, Aug 11 2019 1:52 AM | Last Updated on Sun, Aug 11 2019 1:52 AM

Terrorist Data Bank - Sakshi

సదస్సులో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే చట్టాన్ని తీసుకొచ్చామని, అలాంటివారి డేటా బ్యాంక్‌ను తయారు చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి(యూఎన్‌)తో కలసి జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదుల డేటాబ్యాంక్‌ను రూపొందిస్తామని తెలిపారు. లైంగిక, సైబర్, ఇతర నేరాలకు పాల్పడేవారి డేటాబ్యాంక్‌ను సైతం తయారు చేస్తున్నామని, భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు, బ్యాంకురుణాలు లభించవని స్పష్టం చేశా రు. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ అనే అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానించే ప్రక్రియ 90 శాతం పూర్తి అయిందని, ఏ పోలీసుస్టేషన్‌లో ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చని అన్నారు. బంగ్లాదేశ్‌సహా ప్రపంచంలోని చాలాదేశాలు తమ పౌరులకు స్మార్ట్‌ గుర్తింపుకార్డులు జారీచేశాయని, మనదేశంలో సైతం అలాంటివి జారీ చేస్తే బాగుంటుందని అన్నారు. స్మార్ట్‌కార్డు ద్వారా పౌరుల సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుందని, అయితే, ఆధార్‌కార్డునే సరిగ్గా అమలు చేయనీయడం లేదని, స్మార్ట్‌కార్డులను తెస్తే అంగీకరించే పరిస్థితులు లేవన్నారు.  

సరిహద్దులకు సైబర్‌ ఫెన్సింగ్‌ 
దేశ సరిహద్దులకు మానవరహిత రక్షణ కల్పించేందుకు సైబర్‌ టెక్నాలజీతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని, ఇండో–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో ‘హై టెక్నికల్‌ సర్వెలైన్స్‌ సిస్టం’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా భూమి, నీరు, గాలి, భూగర్భంలో నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని, చొరబాటుదారులను ఏరివేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా చైనా సరిహద్దులో ఏం జరుగుతుందో తామే ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో కూర్చొని ప్రత్యక్షంగా చూసుకోవచ్చని పేర్కొన్నారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తులపై సైబర్‌ దాడులు జరగకుండా ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సైబర్‌నేరాలు పెద్దఎత్తున పెరిగే అవకాశమున్నందున కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

మహిళల భద్రతకు పెద్దపీట 
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి కోసం హోంశాఖలో వుమెన్‌ సేఫ్టీ డివిజన్‌ను ఏర్పాటు చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. మహిళలపై సైబర్‌ నేరాల నిర్మూలనకు, ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలను నియంత్రించేందుకు జాతీయస్థాయిలో హిమ్మత్‌ పేరుతో 112 అత్యవసర కాల్‌ సదుపాయాన్ని ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది
కాశ్మీర్లో ప్రశాంతత నెలకొందని, ప్రజలు రోడ్లమీద స్వేచ్ఛగా తిరుగుతున్నారని కిషన్‌రెడ్డి అన్నా రు. కాశ్మీర్లోని చాలాప్రాంతాల్లో శనివారం కర్ఫ్యూ ఎత్తివేశామని, ప్రజలందరూ సంతోషంగా బక్రీద్, ఇతర పండుగలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సదస్సు అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆరి్టకల్‌ 370 రద్దుపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హెచ్చరించిన నేపథ్యంలో అంతర్గతంగా, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పాకిస్తాన్‌ చెప్పినంత తేలికగా భారతదేశంలో ఏదైనా చేసే పరిస్థితులు లేవని చెప్పారు. ఆర్టికల్‌ 370 కారణంగా దేశానికి జరుగుతున్న నష్టాన్ని పూరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల జమ్మూకాశ్మీర్తోపాటు దేశానికీ ప్రయోజనం కలుగుతుందని పేర్కొ న్నారు. ఆరి్టకల్‌ 370 రద్దుతో అక్కడికి పరిశ్రమలు వస్తాయని, స్థానికులకు ఉద్యోగాలొస్తాయన్నారు. ఇక నుంచి అక్కడ భారతీయ చట్టాలు అమలవుతాయన్నారు.   

పీఎం జాగ్రత్తగా మాట్లాడమన్నారు
ఎవరి దగ్గర ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే తమను హెచ్చరిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. స్నేహి తులే కదా అని వారి వద్ద క్యాజువల్‌గా మట్లాడినా రికార్డు చేసే అవకాశముండటంతో అప్రమత్తతతో ఉండాల్సి వస్తోందన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement