సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలో తేల్చాల్సింది తెలంగాణ ప్రజలేగానీ.. అసమర్థుడైన రాహుల్‌గాంధీ కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందంటూ ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మిడిమిడి జ్ఞానంతో, ఏమాత్రం అవగాహన లేకుండా రాహుల్ చేసిన ఉపన్యాసం విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఏ పార్టీ ఖతం అవుతుందనేది నాలుగు నెలల్లో రాహుల్‌కు అర్థం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటేనని.. రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసు లాంటివని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక..
కాంగ్రెస్ పార్టీని నడపలేనంటూ, చేతగానితనంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన రాహుల్ గాందీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘2018లో తెలంగాణ ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. 12 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. కొందరు అమ్ముడుపోతే, మరికొందరు పదవుల కోసం పార్టీ ఫిరాయించారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ కట్టగట్టుకొని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన చరిత్ర రాహుల్‌గాందీకి గుర్తుకులేదా?’’అని ప్రశ్నించారు.
ఎవరికి ఎవరు ‘బీ టీం’ అనేది ప్రజలకు తెలుసు
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకుని, పక్కా ప్రణాళికతో బీజేపీపై కుట్రకు పాల్పడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి పనిచేశాయని.. ఎవరికి ఎవరు బీ టీం అనేది ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని.. రాహుల్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే రాజకీయాల్లోకి వచ్చారు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటుందని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం
మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 8న వరంగల్‌లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం కలసి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు నడుస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
గతాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై విమర్శలు
గత నెలలో పట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌తో కలసి పాల్గొన్న అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలవడం వెనక వాళ్ల బంధమేంటో అర్థమవుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే నాయకుడిగా ఎదిగారని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు.
గతంలో బీఆర్‌ఎస్‌తో కలసి పనిచేసిన విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే.. బీజేపీపై రాహుల్‌గాంధీ అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్‌ఎస్ అంతే దూరమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో కలసి బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదని, భవిష్యత్‌లోనూ కలసి పనిచేయబోమని చెప్పారు. తెలంగాణలో మజ్లిస్ ను పెంచిపోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అయితే.. దానితో కలసి ఊరేగుతున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment