రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటు స్థలం నమూనాను పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి, బండి తదితరులు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర సర్కారు తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ నిధులు ప్రాజెక్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, జాతీయ నాయకులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు.
కాజీపేట అయోధ్యపురంలో పీఓహెచ్, వ్యాగన్‌ల తయారీ కేంద్ర నిర్మాణ ప్రాంతం, బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. ఎస్‌వీ కన్వెన్షన్ హాల్‌లో మోదీ విజయసంకల్ప సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి మాట్లాడారు.
‘బయ్యారం’ఏమైందో కేసీఆర్ చెప్పాలి..
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివిధ కారణాలతో సాధ్యం కాలేదని, దీంతో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్‌తో పాటు అదనంగా వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8వ తేదీలోగా దీనికి భూమి కేటాయింపు కూడా పూర్తవుతుందన్నారు. కాగా సుమారు రూ.5,587 కోట్ల వ్యయంతో వరంగల్‌ను కలిపే, పలు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీదేనని స్పష్టం చేశారు.
దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైలు..
తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.26 వేల కోట్ల మేరకు ఖర్చవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఆర్‌కు అనుసంధానంగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని తెలిపారు.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని, సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, భూసేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు.
అధ్యక్షుడి మార్పుపై ఎవరైనా చెప్పారా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి నేరుగా స్పందించకుండా జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా మీకు చెప్పారా.. అందరం వేదికపై కలిసే ఉన్నాముగా.. ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది.. అలాంటిదేమీ లేదు’అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కిరాణ దుకాణం లాంటిది..
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంటేనే ద్రోహం, కుట్రలకు ప్రతిరూపమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందో అన్న భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment