తెలంగాణపై మాట మార్చలేదు
పొత్తులపై చర్చ జరగలేదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు మద్దతు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తమ పార్టీ జాతీయ నేతలు పునరుద్ఘాటించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు వస్తున్న వార్తలు, పొత్తుల విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ, రాజ్యసభ పక్షనేతలను కలిసినపుడు ఈ విషయం తేల్చిచెప్పారని తెలిపారు. సొంత నేతలను అదుపులో పెట్టుకోలేని కాంగ్రెస్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయిస్తోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా పార్టీ నిర్వహించనున్న ‘ఏక్‌నోట్-కమల్ పర్ ఓట్’ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావుతో కలసి విలేకరులతో మాట్లాడారు.
రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విభజన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తప్పుబట్టాలిగాని పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టకముందే అభాండాలు వేయ డం తగదని ఆ పార్టీ తెలంగాణ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులతో కలసి ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడారు. టీ బిల్లుకు సవరణల రూపంలో ఇచ్చిన ప్రతిపాదనలు కేవలం సీమాంధ్ర బీజేపీకి సంబంధించినవేనని రాజేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలకు జాతీయ పార్టీకి, తెలంగాణ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విభజనకే తమ ఓటు అని, తెలంగాణ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో చెప్పారు. అయితే మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలన్నారు.