కేసీఆర్ కుటుంబమే అమెరికా వెళ్లాలా?
దేవయ్యపై విమర్శలు వెనక్కి తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
హన్మకొండ : ‘దళితుడు అమెరికాకు వెళ్లొద్దా.. విదేశాలకు వెళ్లి వచ్చే అర్హత వారికి లేదా?.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే అమెరికాకు వెళ్లాలా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీ బలపరిచిన అభ్యర్థి పగిడిపాటి దేవయ్య పై టీఆర్‌ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు చేసిన విమర్శలపై మండిపడ్డారు.
దేవయ్య మాతృభూమి వరంగల్ జిల్లాపై ఉన్న ప్రేమతోనే అమెరికాలో ఉన్నా పౌరసత్వం తీసుకోలేదన్నారు. 2009 నుంచే జిల్లాలో సేవా కార్యక్రమా లు చేపట్టారని గుర్తుచేశారు. మంత్రులు తమ విమర్శలను వెనక్కు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబు ల్ బెడ్‌రూం ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం సామాజిక, సంక్షేమ పథకాల నిధులు ఇస్తోందని చెప్పారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికతో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. దేవయ్యను గెలిపించాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాయకులు మార్తినేని ధర్మారావు, పేరాల చంద్రశేఖర్‌రావు, రావు పద్మ, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, గాదె రాంబాబు, దిలీప్‌నాయక్, మల్లాడి తిరుపతిరెడ్డి, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.