
మోడీ సభ అంచనాలకు మించి విజయవంతం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సార థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నవభారత యువభేరి’ సదస్సు తమ అంచనాలకు మించి విజయవంతమైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ శానసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సహా పలువురితో కలిసి సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ సభకు వచ్చిన స్పందన రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీకి నూతనోత్సాహం కలిగించిందన్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సృష్టించబోయే ప్రభంజనానికి హైదరాబాద్ సభే నిదర్శనమన్నారు.
ఈ సభను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మరిన్ని చోట్ల మోడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. మోడీని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యాలను కిషన్‌రెడ్డి ఖండించారు. ‘బొత్సకు సొంత పార్టీ సీడబ్లూసీలో చేసిన తీర్మానమే అర్థం కాలేదు.. ఇక మోడీ ప్రసంగం ఆయనకు ఏం అర్థమవుతుంది?’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పార్టీ నాయకులనే సమైక్యంగా ఉంచుకోలేని బొత్సకు మోడీని విమర్శించే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని కిషన్‌రెడ్డి ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
బీసీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీలకు కూడా సబ్‌ప్లాన్ అమలుపరచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. ఇందుకోసం మొదటి దశలో జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో పెద్ద స్థాయిలో త్వరలోనే ఆందోళనలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. సోమవారమిక్కడ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఆదివారం నవభారత యువభేరి సదస్సు జరిగిన తీరుపై నేతలు సమీక్షించారు. మోడీ సూచన మేరకు రాష్ట్రమంతటా బూత్ కమిటీల బలోపేతంపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువత ఎక్కువగా మోడీ పట్ల ఆదరణ కలిగి ఉండడంతో వారిని ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియను పార్టీ పరంగా చేపట్టాలని కూడా నిర్ణయించారు.
బీజేపీలోకి నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు
నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆలూరి గంగారెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దశరథ్‌రెడ్డితో కలిసి ఆయన కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.