
‘రాహుల్‌గాంధీ వస్తే 10 లక్షల దోమలతో కుట్టిస్తా’
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి పేర్కొన్నారు.
తాండూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి పేర్కొన్నారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల పొత్తులపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు.
తెలంగాణలో బీజేపీ అధిక స్థానాలను దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తన సీఎం అభ్యర్థిత్వం పార్టీలో ఎజెండాలో లేదని, అసలు అలాంటి చర్చే లేదని స్పష్టం చేశారు. సర్వం కోల్పోయిన రైతులు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు నష్టపోవడంతో రైతన్నలు సర్వం కోల్పోయారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 24లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన మండిపడ్డారు.
రెవెన్యూ, వ్యవసాయ అధికారులూ ఎవరూ పొలాలను సందర్శించి.. పంటనష్టం వివరాల సేకరణ ప్రారంభించలేదని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ అనుసరిస్తున్న వైఖరి, ఆలోచన, వ్యవహారాల కారణంగా రాష్ట్రానికి నష్టం జరుగుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తుపాన్లు, వరదలు, కరువు, కాటకాలతో నష్టానికి 45వేల కోట్ల సహాయం కోరితే కేవలం రూ.2,500 కోట్లు భిక్షం వేసినట్లు కేంద్రం సహాయం చేసిందని విమర్శించారు.
కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నా ‘ఉత్తరకుమారుడు’ సీఎం ఒత్తిడి తేవడంలో వైఫల్యం చెందారన్నారు. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే 25 వేల దోమలు కుట్టాయని, రాష్ట్రానికి ఇచ్చిన రూ.4600 కోట్ల సహాయం ఏమైందని రాహుల్‌గాంధీ ప్రశ్నించడాన్ని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘మా రాష్ట్రానికి రా... 10 లక్షల దోమలతో కుట్టిస్తా... మా రాష్ట్రానికి ఎంత సాయం చేస్తారు’ అని ఆయన రాహుల్‌ను ప్రశ్నించారు.