
'పసలేదు, కారం లేదు... కేసీఆర్ ప్రకటనలా ఉంది'
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో శనివారం జరిగిన సంఘటనని ఖండిస్తారా ? లేక సమర్థిస్తారా ? అని సీఎం కేసీఆర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ... నేడు జరిగిన శాసనసభ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ వెల్లోకి వెళ్లాల్సిన అవసరమేముందని ఆయన అధికార పార్టీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.
శనివారం సభలో జరిగిన తీరుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సభలో చోటు చేసుకున్న ఘర్షణపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదు, కారం లేదని... అది సీఎం కేసీఆర్ ప్రకటనలా ఉందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు.